Narendra Modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూలో పర్యటించిన ప్రధాని మోదీ..

Narendra Modi: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధికి ఊతమిచ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 370 అధికరణ రద్దు అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటించిన ప్రధాని మోదీకి స్థానికంగా ఘన స్వాగతం లభించింది. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ.. ఇన్‌టాక్ ప్రదర్శనశాలను మోదీ సందర్శించారు. అటు జమ్ముకశ్మీర్‌లో 20వేల కోట్ల విలువైన అనుసంధానం, విద్యుత్ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని..108 జన ఔషధీ కేంద్రాలతోపాటు సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. దిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ రహదారి, చీనాబ్ నదిపై రెండు జల విద్యుత్ ప్రాజక్టులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లా పల్లీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. దేశంలోని పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించారు.
కశ్మీరు లోయలో అమలవుతున్న కేంద్ర పథకాలతో స్థానికులు లబ్ధి పొందుతున్నారన్న ప్రధాని..ఏళ్లతరబడి రిజర్వేషన్ల ఫలాలు పొందలేనివారికి సైతం లబ్ధిచేకూరుతోందన్నారు. జమ్మూకశ్మీరు అభివృద్ధిలో నూతన అధ్యాయ రచన జరుగుతోందన్న ప్రధాని.. అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం ప్రైవేటు పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారన్నారు.
అటు సైతం టూరిజం మళ్లీ ఊపందుకుంటోందన్న ప్రధాని మోదీ.. అన్ని కాలాల్లోనూ జమ్మూ-కశ్మీరుకు కనెక్టివిటీ కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు సాంబ జిల్లా పల్లీ గ్రామం దేశ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించింది. స్థానిక 500 KV సోలార్ ప్లాంటును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంతో ..కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా ఘనత సాధించింది. గ్రామ్ ఊర్జా స్వరాజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేవలం సుమారు మూడు వారాల్లోనే ఈ ప్లాంట్‌ను నిర్మించడం మరో విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com