Narendra Modi: పెట్రో ధరలపై మోదీ వ్యాఖ్యలు.. విరుచుకుపడుతున్న విపక్షాలు..

Narendra Modi: దేశ రాజకీయాల్లో మళ్లీ పెట్రో మంట రాజుకుంది. పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్‌లో ఎక్సైజ్ సుంకాలు తగ్గించినా కొన్ని రాష్ట్రాలు పన్నులపై వెనక్కి తగ్గట్లేదని విమర్శించారు. తెలంగాణ, ఏపీ, బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇంధన ధరల పెరగడంతో.. ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించాల్సిందన్నారు ప్రధాని.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాయి విపక్షాలు. మోదీ వ్యాఖ్యలపై… సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బుద్ధి ఉండాలంటూ మండిపడ్డారు. కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ.. ఇష్టమొచ్చిన సెస్సులు బాదుకుంటూ…రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని ఎలా అంటుంది అంటూ ప్రశ్నించారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా ఈ అంశంపై మాట్లాడిన కేసీఆర్... కేంద్రం రాష్ట్రాలను బలహీనపర్చాలని కుట్ర పన్నుతోందంటూ మండిపడ్డారు.
అటు కాంగ్రెస్ సైతం.. మోదీ వ్యాఖ్యలపై మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ, కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎక్సైజ్ సుంకాలతోనే కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు. మరోవైపు మహరాష్ట్ర సర్కారు సైతం కేంద్రంపై మండిపడింది.
మహారాష్ట్ర నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందని, అయినా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. రాష్ట్రానికి కేంద్రం రూ. 26 వేల 500 కోట్లు బాకీ ఉందని ఆరోపించారాయన. బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ సైతం ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇంధన ధరలపై ప్రధాని మోదీ ఒక్కరే మాట్లాడారని, ఇది ఏకపక్ష చర్యలా ఉందన్నారామె.
మోదీ వ్యాఖ్యలతో ఏకీభవంచట్లేదని స్పష్టం చేశారు. ఇంధన ధరలను అదుపు చేయలేకనే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు కేంద్రం జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి.. ఇంధన ధరలపై.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఘాటుగా స్పందించాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com