National Handloom Day 2023: చేనేతకు చేయూతనిద్దాం

National Handloom Day 2023: చేనేతకు చేయూతనిద్దాం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ‌

చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది..దానిని ఇంకాస్త పెద్ద చేప తినేస్తుంది.. అలాగే ఒకప్పుడు అద్భుతం అనిపించిన చేనేత మగ్గాలను మరమగ్గాలు పవర్‌లూమ్స్‌ మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మిషన్లు తినేస్తున్నాయి. రెక్కడితే గానీ డొక్కాడని నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. ఒకప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. కలకత్తా టౌన్‌ హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో, కష్టాల్లో మగ్గిపోతున్న ఆ కార్మికులకు ఊటమివ్వాలనే లక్ష్యంతో 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను అందిస్తున్నారు.

ఇటీవల ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళిన ప్రధాని మోదీ- ఆ దేశ ప్రథమ మహిళ బ్రిజిట్‌ మెక్రాన్‌కు పోచంపల్లి పట్టుచీరను బహుమతిగా ఇచ్చారు. భారతీయ హస్తకళా నైపుణ్యానికి దర్పణమైన ఆ చీరను ఆమె అపురూప కానుకగా అభివర్ణించారు. అయితే, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న మన చేనేతకు తగిన ప్రోత్సాహం దక్కడంలేదు. భారతదేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి మార్గం ఇది.


చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. 2003నాటికి దేశంలో 82లక్షల మగ్గాలు ఉండేవి. నేడు అవి కేవలం 23.77లక్షలే అలాగే 2019-20 చేనేత జనగణన సర్వే ప్రకారం- అప్పుడు దేశంలో 35 లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య దాదాపు 28 లక్షలకు పడిపోయింది. నేత కార్మికుల్లో అధికశాతం తమ నివాసాల్లో, సమీపంలోని చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్నారు. ఆదినుంచీ ఉన్న చరఖాలు, రాట్నాలు, మగ్గాలనే వారు వినియోగిస్తున్నారు. నూలు తెచ్చి వస్త్రాలు తయారుచేసి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం. అయితే ఇప్పుడిప్పుడే చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి, ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది.

ఇకనైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని, వస్త్ర పరిశ్రమలో శ్రమించే కార్మికుల పొట్ట నింపేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే కార్మికులకు మేలు చేసేలా ప్రభుత్వం కొంత చొరవ చూపింది. కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలని వారు ఎదురు చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story