పేషెంట్లకు జనరిక్ మందులనే రాయాలని డాక్లర్లకు NMC సూచన

పేషెంట్లకు బ్రాండెడ్ మందులు రాయొద్దని డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించింది. ఇక నుంచి మందుల చీటీలో జనరిక్ ఔషధాలనే రాయాలని స్పష్టంచేసింది. ఒకవేళ అలా రాయని పక్షంలో వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొంది. అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా డాక్టర్ లైసెన్స్‌ను కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది కమిషన్. ఈ మేరకు నిబంధనలను మార్చింది. జనరిక్ మందుల విషయంలోనూ బ్రాండెడ్ రాయకూడదని స్పష్టం చేసింది.
డాక్టర్లు జనరిక్ ఔషధాలను రాయాలని గతంలోనే పేర్కొంది. కాని చాలా మంది డాక్టర్లు బ్రాండెడ్ మందులే రాస్తుండటంతో తాజాగా నిబంధనల్లో మార్పు చేసింది. బ్రాండెడ్ మందులతో పోల్చితే జనరిక్ మందుల ధరలు 30 శాతం నుంచి 80 శాతం తక్కువగా ఉంటాయి. దీంతో జనరిక్ మందులను సూచిస్తే పేషెంట్ల హెల్త్ బడ్జెట్ భారం తగ్గుతుందని కమిషన్ భావిస్తోంది.
మందుల చీటీలో సూచించిన పేర్లను స్పష్టంగా చదవగలిగేలా పొడి అక్షరాల్లోనే రాయాలని మరోసారి డాక్టర్లను సూచించింది. వీలైతే మందుల చీటీని టైప్ చేసి ప్రింట్ తీసి ఇవ్వాలని సలహా ఇచ్చింది. తాజా నిబంధనలను ఉల్లంఘించిన డాక్టర్లకు తొలుత హెచ్చరికలు జారీ చేస్తామని పేర్కొంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే డాక్టర్ల లైసెన్స్‌ను కొంతకాలం పాటు సస్పెండ్ చేస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com