Ajit Doval: శాంతి చర్చల కోసం మాస్కోకు ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్!
రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదానికి ముగింపు కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ కీలక పరిణామం జరగబోతోంది. ఈ వివాదానికి పరిష్కారమే లక్ష్యంగా రష్యాతో శాంతి చర్చలు చేపట్టేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ త్వరలోనే మాస్కో వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ వారమే ఆయన రష్యా రాజధాని మాస్కోకు వెళ్తారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రెండు నెలల వ్యవధిలో రష్యాతో పాటు ఉక్రెయిన్‌ను కూడా సందర్శించారు. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆగస్టులో ఉక్రెయిన్ పర్యటన అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో చర్చించారు. ఉక్రెయిన్ పర్యటనలో తాను గమనించిన వివరాలను ఆయన తెలియజేశారు. ఇరు దేశాల మధ్య వివాదం పరిష్కారానికి భారత్ చేయగలిగిన సాయం చేస్తుందని హామీ కూడా ఇచ్చారు. ఈ మేరకు భారత్ నిబద్ధతతో ఉందని అన్నారు.
మోదీ-పుతిన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలోనే శాంతి చర్చలకు అంగీకరించారని, ధోవల్‌ను అక్కడికి పంపించేందుకు ఇరువులు నేతలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ధోవల్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఇటీవల వ్లాడివోస్టాక్ లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ లో, 2022 నుండి ఇస్తాంబుల్ ఒప్పందంపై ఆధారపడి ఈ చర్చలు జరగాలనే షరతుపై ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు సంబంధించి భవిష్యత్తులో జరిగే శాంతి చర్చలలో చైనా, భారతదేశం, బ్రెజిల్‌లను సంభావ్య మధ్యవర్తులుగా కూడా ఆయన ప్రతిపాదించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com