"రథయాత్ర" మంగళ హారతిలో హోంమంత్రి అమిత్ షా..


తన సొంతరాష్ట్రం గుజరాత్ పర్యటనలో బిజీగా ఉన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్‌లో నిర్వహించే అతిపెద్ద రథయాత్ర పండగలో పాల్గొననున్నారు. ఒడిషాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తర్వాత అహ్మదాబాద్‌లో జరిగే ఈ రథయాత్రే దేశంలో పెద్దది. ఈ నేపథ్యంలో జమ్లాపూర్ ప్రాంతంలో పవిత్రమైన మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో బిజీగా గడపనున్నారు. వీటిలో ముఖ్యంగా అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు, AMC మరియు రైల్వే ఆధ్వర్యంలో నిర్మించిన జగత్పూర్ రైల్వే ఫ్లై ఓవర్‌ని ప్రారంభించనున్నారు. అలాగే అహ్మదాబాద్‌లోని క్రెడాయ్ గార్డెన్ ఏరియాలో పబ్లిక్ పార్కుని ప్రారంభించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ బవ్లా ప్రాంతంలో త్రిమూర్తి ఆసుపత్రి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
అహ్మదాబాద్ నగరంలో అత్యంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నగరంలోని పలు వీధుల గుండా భక్తులకు దర్శనమిస్తూ సుమారు 18 కిలోమీటర్లు సాగనుంది. మూడు రథాల్లో ఒక దాంట్లో జగన్నాథుడు, రెండవ రథంలో సోదరుడు బలరాముడు (బలభద్ర), మరో రథంలో సోదరి శుభద్రలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నగరంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారు.అనంతరం రాత్రి 8.౩౦ ప్రాంతంలో ఆలయానికి తిరిగి చేరుకోనుంది. ఈ కార్యక్రమాన్ని 20 లక్షల మంది జనం దర్శించుకుంటారని అంచనా.
ఈ రథయాత్ర 1878 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ప్రతి ఆశాఢ మాసం ప్రారంభం 2వ రోజున ఈ రథయాత్ర నిర్వహిస్తారు. నగరంలో 400 ఏళ్ల ప్రాచీన ఆలయం ఆధ్వర్యంలో ఈ రథయాత్ర నిర్వహించబడుతోంది. రథయాత్రకి ముందుగా పవిత్రమైన మంగళహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రథయాత్ర వెళ్లే మార్గాన్ని శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి పహింద్ వీధి అని పేరు. భక్తుల కోలాహలం మధ్య మొదటగా జగన్నాథుడి రథం తీసుకువస్తారు. అనంతరం సోదరి శుభద్ర రథం, సోదరుడు బలరాముడి రథాలు వెంట తీసుకువస్తారు. ఇదే కాకుండా ఒడిశాలోని పూరీ నగరం మరియు బెంగాల్‌లోని కోల్‌కతాలో రథయాత్రని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఇపుడు నిర్వహించే 146వ జగన్నాథ రథయాత్రకి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారుగా 26,౦౦౦ మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. గుజరాత్ పోలీసులు తొలిసారిగా నిఘా కోసం 3డీ టెక్నాలజీ మరియు యాంటీ-డ్రోన్ టెక్నాలజీ వినియోగించనున్నారు. CCTVల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు. వీటి ఉపయోగించి రథయాత్ర మార్గాన్ని పర్యవేక్షించనున్నారు. అలాగే అనుమతుల్లేని డ్రోన్లని పర్యవేక్షించడానికి యాంటీ-డ్రోన్ టెక్నాలజీ వినియోగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com