Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మద్దతుగా నేడు నిరాహారదీక్షలు

Arvind Kejriwal:  కేజ్రీవాల్‌కు మద్దతుగా నేడు నిరాహారదీక్షలు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా నిరాహారదీక్షకు దిగాలని ఆమ్‌ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. భారత్‌ సహా కెనడా, యూకే, యూఎస్‌ తదితర దేశాల్లోని భారతీయులు దీక్ష చేయనున్నారని ఆప్‌ నేతలు చెప్పారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరస్టై జైల్లో ఉన్న ఆప్‌ నేత, మనీష్‌ సిసోడియా జ్యూడీషియల్‌ కస్టడీని కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. సిసోడియాకు ఇదివరకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ గడువు పూర్తవ్వటంతో ఆయన్ను కోర్టు ముందు హాజరు పర్చారు.

ఇక 2017 గోవా ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపిన గోవాలోని మపుసా కోర్టు.. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. దీంతో 2017 గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌పై నమోదైన కేసులో ఆయనకు భారీ ఊరట లభించింది.

2017 లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. అన్ని పార్టీలు, అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు అయిన చీపురుకే వేయండి అని అరవింద్ కేజ్రీవాల్ ఆ బహిరంగ సభ నుంచి గోవా ఓటర్లకు సూచించారు. దీంతో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఈ వ్యాఖ్యలకు గాను ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ సెక్షన్ 171 (ఇ) లో భాగంగా లంచానికి సంబంధించిన కేసు అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గతేడాది నవంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. 2017, 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసింది. అయితే 2017లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ.. 2022 ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లను గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story