Nawab Malik: దావూద్ కేసులో మహారాష్ట్ర మంత్రి అరెస్టు.. అయినా పోరాడతానంటూ వ్యాఖ్యలు..

Nawab Malik (tv5news.in)
Nawab Malik: ముంబై అండర్‌వరల్డ్ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ స్టేట్‌మెంట్ నమోదు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఆయనను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అధికారులు..తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
అరెస్టు చేసినంత మాత్రాన భయపడేది లేదన్నారు నవాబ్ మాలిక్. అరెస్టు తర్వాత వైద్య పరీక్షలకు తరలిస్తున్న క్రమంలో ఈ కామెంట్స్ చేశారు. పోరాడి విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. నవాబ్ మాలిక్ అరెస్టు వార్త తెలియగానే ఈడీ ఆఫీసుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎన్సీపీ కార్యకర్తలు. అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
తెల్లవారుజామున 4 గంటలకే ముంబై ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు నవాబ్ మాలిక్. ఉదయం 7 గంటలకు విచారణ ప్రారంభమైంది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్‌తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్‌కు సంబంధించిన అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్ అరెస్టు తర్వాత విచారణలో కీలక రహాస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com