OPPOSITION MEET: శరద్‌ పవార్‌ డుమ్మా

OPPOSITION MEET: శరద్‌ పవార్‌ డుమ్మా
ప్రతిపక్షాల మలి విడత భేటీకి శరద్ పవార్‌ డుమ్మా... తొలి రోజు సమావేశానికి పవార్ రావట్లేదన్న ఎన్సీపీ... రెండో రోజూ సమావేశానికి హాజరవుతారని వెల్లడి

‍ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)ని ఎదుర్కోవడమే లక్ష్యంగా విపక్షాలు జరుపుతున్న మలి విడత భేటీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ హాజరు కావడం లేదు. శరద్‌ పవార్‌(Sharad Pawar) మొదటి రోజు సమావేశంలో పాల్గొనడం లేదని NCP వెల్లడించింది. మంగళవారం జరిగే రెండో రోజు సమావేశానికి పవార్ హాజరవుతారని శరద్ పవార్ వర్గం నేత మహేశ్ భరెత్ తపసే తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్న ప్రతిపక్షాలు నేడు, రేపు బెంగళూరులో రెండోసారి సమావేశం కానున్నాయి. గత నెల 23న బిహార్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగే ఇవాళ్టి సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య మరింత పెరిగింది. తొలి సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీRLD), ఎండీఎంకే(MDMK), కేడీఎంకే(KDMK), వీసీకే(VCK), ఆర్‌ఎస్‌పీ(RSP), ఫార్వర్డ్‌ బ్లాక్‌(FORWARD BLOCK), ఐయూఎంఎల్‌ (IUML), కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి. మొత్తం 24 విపక్ష పార్టీలు సమావేశానికి హాజరవుతాయి. కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పాట్నాలో జరిగిన మొదటి సమవేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశానికి స్వాగతం పలుకుతూ పెద్ద పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఇవాళ మధ్యాహ్నం జరిగే సమావేశానికి విపక్ష నేతలంతా రానున్నారు. సాయంత్రం 6 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది, ఆ తర్వాత రాత్రి 8 గంటలకు విందు ఉంటుంది. జులై 18న ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ భేటీ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 23న పాట్నాలో తొలి మెగా ప్రతిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా విపక్ష నేతలు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఆలోచన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story