Baba Siddique : మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య

Baba Siddique :  మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య
X
బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్‌ పవార్‌ పక్షం) సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, ముగ్గురు దుండగులు వచ్చి సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే అతనిని లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ కూపర్​ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సిద్ధిఖీ కొన్ని నెలల కిందటే ఎన్సీపీలో చేరడం గమనార్హం.

ఘటనపై సీఎం షిండే ఏం చెప్పారు?

ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటన కూడా వెలువడింది. దాడికి సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు కూడా సూచనలు చేశామని సీఎం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైలో శాంతిభద్రతలపై ఎలాంటి ప్రభావం ఉండకూడదు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్తామన్నారు. ఈ ఘటనపై శివసేన యూబీటీ నేత ఆనంద్ దూబే మాట్లాడుతూ ముంబైలో మాజీ ఎమ్మెల్యేలు సురక్షితంగా లేరని అన్నారు. ఇంతకు ముందు మంత్రులుగా ఉన్నవారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారి జీవితాలకు భద్రత లేకపోతే ఈ ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి భద్రత కల్పిస్తుంది? అని ప్రశ్నించారు. బాబా సిద్ధిఖీ హత్య ఆందోళన కలిగిస్తోందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి. ఇది పెద్ద కుట్రగా అనిపిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్నికలకు ముందు దారుణం

మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం గమనార్హం. సిద్ధిఖీ 1999, 2004, 2009లో బాంద్రా వెస్ట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజా సేవ చేయడంతోపాటు, ఆయన చాలా గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తుంటారని చెబుతుంటారు. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ హాజరయ్యారు. అప్పట్లో వారిద్దరి మధ్య విభేదాలుండేవి. కానీ సిద్ధిఖీ పెద్ద పార్టీ ఏర్పాటు చేసి, ఆ ఇద్దరు స్టార్స్​ను దగ్గరకు చేర్చి గొడవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టించారు.

Tags

Next Story