Supriya Sule : సుప్రియా సూలే...సరికొత్త ప్రచారం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్‌చంద్ర పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే...సరికొత్త ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హంగు-ఆర్బాటాలతో కూడిన సభలు, సమావేశాల కంటే కూడా...సాదాసీదా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రచారంలో భాగంగా యువతను ఆకట్టుకునేందుకు ఇటీవల బ్యాడ్మింటన్ గేమ్‌లో పాల్గొన్న ఆమె తాజాగా రైల్లో ప్రయాణిస్తూ ప్రచారం చేశారు.
నేష‌్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్‌చంద్ర పవార్ వర్గానికి చెందిన కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే...వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు...హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదా ప్రచారంతో కొత్తపుంతలు తొక్కుతున్నారు. ప్రచారసభల కంటే కూడా ఓటర్లను స్వయంగా కలిసేందుకు ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రచారంలో భాగంగా బారామతిలో ఇదివరకు యువతతో కలిసి బ్యాడ్మింటన్ గేమ్‌లో పాల్గొన్న సుప్రియాసూలే...తాజాగా రైల్వే స్టేషన్‌లో ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి ఈసారి ఎన్నికల సంఘం కొత్తగా బాకా గుర్తును కేటాయించటంతో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వినూత్న ప్రచారం కలిసి వస్తోంది.
సుప్రియాసూలే తాజాగా పుణె రైల్వేస్టేషన్‌లో ప్రచారం నిర్వహించారు. స్టేషన్‌లో ఆగిన ప్రతి రైలు వద్దకు వెళ్లి...అందులోని ప్రయాణికులకు అభివాదం చేశారు. శరద్ పవార్ వర్గానికి ఈసీ కొత్తగా కేటాయించిన ఎన్నికలగుర్తు బాకాపై ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. యావత్-దౌండ్ మధ్య డెము రైల్లో కొంతదూరం ప్రయాణించిన సుప్రియా సూలే...వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికులను కలిసి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు చెప్పిన సమస్యలను సుప్రియా సూలే సావధానంగా విన్నారు. కొందరు ప్రయాణికులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
బారామతిలో ఈసారి పవార్ కుటుంబానికే చెందిన వదిన-మరదళ్లు తలపడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పవార్ కుటుంబానికి బారామతి నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన సుప్రియాసూలే ఈసారి తన సొంత వదిన, అజిత్ పవార్ సతీమణి సునేత్రపవార్‌తో తలపడుతున్నారు. ఇంతవరకు ఇక్కడ సుప్రియాసూలే గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఈసారి సొంత వదిన ప్రత్యర్థి కావటంతో సుప్రియా సూలే గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇరువర్గాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అజిత్ వర్గం తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. అందుకే ఈ ఎన్నికల్లో సత్తాచాటేందుకు ఇరువర్గాలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్ తన కుమార్తె సుప్రియాసూలే తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. 15ఏళ్లలో ఎంపీగా తన కుమార్తె చేసిన పనులను ఓటర్లకు వివరిస్తున్నారు. తమ పార్టీకి ఈసీ కొత్తగా కేటాయించిన బాకా గుర్తుపై ఓటు వేయాలని శరద్ పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com