Mahua moitra: మహువాపై ఎఫ్‌ఐఆర్‌కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలకు గాను లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తెలిపింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. రేఖా శర్మకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి తృణమూల్ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి గొడుగు పడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన మహువా ‘ఆమె తన యజమాని పైజామాను ఎత్తి పట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు’ అని వ్యాఖ్యను జోడించారు. ఆ తరువాత తన వ్యాఖ్యను తొలగించారు. ‘మహిళల గౌరవానికి భంగం కలిగించే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది.
ఈ పరిణామాన్ని ఎన్‌సీడబ్ల్యూ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని, పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ పంపామని ఎన్‌సిడబ్ల్యూ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో.. ఎన్‌సీడబ్ల్యూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. మోయిత్రా వ్యాఖ్యలు భారతీయ న్యాయ్ సంహిత 2023లోని సెక్షన్ 79 కిందకు వస్తాయని కమిషన్ తెలిపింది. ఈ మేరకు మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎన్‌సీడబ్ల్యూ కోరింది. అలాగే లోక్‌సభ స్పీకర్ కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎంపీ వ్యాఖ్యలు.. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
దీనిపై మోయిత్రా స్పందిస్తూ ఎన్‌సీడబ్ల్యూని అపహాస్యం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. ‘‘ఢిల్లీ పోలీసులు రండి.. దయచేసి సుమోటో ఆర్డర్‌లపై వెంటనే చర్య తీసుకోండి. త్వరితగతిన అరెస్టు చేయడానికి రాబోయే 3 రోజుల్లో తాను నదియాలో ఉన్నాను. ఐ కెన్ హోల్డ్ మై ఓన్ గొడుగు’’ అంటూ పోస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com