C.P. Radhakrishnan: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

C.P. Radhakrishnan: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌
X
ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీ

భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. పార్లమెంట్‌ భవనంలోని ఎఫ్‌-101 వసుధలో జరిగిన పోలింగ్‌లో బ్యాలెట్‌ పత్రాలనే వినియోగించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ఎన్నిక ముగిసింది. ఆరు గంటకు కౌంటింగ్‌ ప్రారంభించారు. ఈ ఎన్నికలో చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ (67)కు అనుకున్న దాని కన్నా అధికంగా ఓట్లు పోలయ్యాయి. విపక్షంలో జరిగిన క్రాస్‌ ఓటింగే దీనికి కారణంగా భావిస్తున్నారు.

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌, రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మొత్తం 781 మంది ఎంపీలకు 767 మంది (98.2 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారని, 14 మంది గైర్హాజరయ్యారని ఆయన చెప్పారు. అందులో 752 ఓట్లు సక్రమంగా ఉండగా, 15 ఓట్లు చెల్లలేదని తెలిపారు. దీనివల్ల అవసరమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల మెజారిటీ 377కు తగ్గిందన్నారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు, రాజ్యసభలో245 మంది ఉండగా మొత్తం సభ్యుల సంఖ్య 788. అయితే ఆరు రాజ్యసభ, ఒక లోక్‌సభ సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత ఎలక్టోరల్‌ కాలేజీ సంఖ్య 781. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయ సభల్లో 427 సభ్యుల బలం ఉంది. వీరికి 11 మంది సభ్యుల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలం తోడవ్వడంతో పాటు కొన్ని చిన్న పార్టీలు రాధాకృష్ణన్‌ను మద్దతు తెలిపాయి.

క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందా?

ఈ ఎన్నికల ఓటింగ్‌లో విపక్షం ఐక్యంగా నిలిచిందని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. తమకు చెందిన 315 మంది ఓటు వేశారని ఆయన చెప్పారు. కాగా, పోలయిన ఓట్లు చూస్తే విపక్షం అనుకున్న దాని కన్నా తక్కువే. ఎందుకంటే విపక్ష ఎంపీలు కొందరు ఎన్డీఏకు మద్దతు ప్రకటించి ఉంటారని ఊహిస్తున్నారు. కాగా, విపక్షానికి చెందిన 15 మంది ఎంపీలు తమకు అనుకూలంగా ఓటు వేశారని, మరికొందరు కావాలని తమ ఓటును చెల్లకుండా చేసుకున్నారని బీజేపీ నేతలు తెలిపారు. సుమారు 40 మంది విపక్ష ఎంపీలు తమ మనస్సాక్షి ప్రబోధం మేరకు ఓటు వేశారని బీజేపీ ఎంపీ సంజయ్‌ జైశ్వాల్‌ ప్రకటించారు.

మోదీ అభినందనలు

భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు నా అభినందనలు. ఆయన జీవితం ఎల్లప్పుడూ సమాజ సేవ చేయడానికి, అణగారిన వర్గాలకు సాధికారిత కల్పించడానికి అంకితం చేశారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

తమిళనాడు మోదీగా గుర్తింపు..

ఆర్‌ఎస్‌ఎస్‌, జన్‌సంఘ్‌ లాంటి సంస్థలతో 16 ఏండ్లకే రాధాకృష్ణన్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 2003 నుంచి 2006 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలో 93 రోజుల పాటు 19 వేల కి.మీ రథయాత్ర నిర్వహించారు. 2024, జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్‌ గవర్నర్‌గా ఏడాదిన్నర పాటు చేశారు. తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చెరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా పనిచేశారు. 1998, 1999లో కోయంబత్తూర్‌ నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు. అభిమానులు ఆయనను తమిళనాడు మోదీగా పిలుస్తారు.

ఈ ఎన్నికల్లో ఓటమిని వినయంగా అంగీకరిస్తున్నానని విపక్ష ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డి ప్రకటించారు. ఓటమి అనంతరం ఆయన ప్రకటన చేస్తూ ప్రజాస్వామ్యం కేవలం విజయం ద్వారా మాత్రమే కాకుండా సంభాషణ, అసమ్మతి, పాల్గొనే స్ఫూర్తి ద్వారా బలపడుతుందని పేర్కొన్నారు. ఫలితం తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ‘మనం సమష్ఠిగా ముందుకు సాగాలని ప్రయత్నించాం’ అన్న పెద్ద లక్ష్యం తగ్గలేదని అన్నారు. తమ సైద్ధాంతిక యుద్ధం మరింత శక్తితో కొనసాగుతుందని అన్నారు.

Tags

Next Story