Mamata Banerjee: ‘మోదీ ప్రభుత్వం కష్టమే..!’ పవార్, ఉద్ధవ్‌లతో దీదీ భేటీ

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అస్థిరంగా ఉందని, అది పూర్తికాలం అధికారంలో కొనసాగదేమోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. శుక్రవారం మహారాష్ట్ర రాజధాని ముంబయికి చేరుకున్న మమత.. ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ , రాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇద్దరితో దీదీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ మూడు పార్టీలూ ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉన్నాయి.
తొలుత ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం ‘మాతోశ్రీ’లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల విషయంలో ఆట ఇప్పుడే మొదలైందన్నారు. జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యాదినం’గా కేంద్రం ప్రకటించడంపై స్పందిస్తూ.. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని, ప్రధాని మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. మూడు కొత్త నేరన్యాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఎవరినీ సంప్రదించలేదని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో వాటిని ఆమోదించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ కొత్త చట్టాల విషయంలో చాలామందిలో ఆందోళన నెలకొందని చెప్పారు.
బెంగాల్‌లో ‘ఇండియా’ కూటమి పరిస్థితులపై దీదీ మాట్లాడుతూ.. లెఫ్ట్ ఫ్రంట్‌తో పోరాడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారంలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో స్థానికంగా సీపీఎంతో సర్దుబాటు సాధ్యం కాదన్నారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. అనంతరం శరద్ పవార్‌ను కలిశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ‘ఇండియా’ కూటమి మెరుగైన ఫలితాలు సాధించింది. ఇదే ఉత్సాహంతో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఈ కూటమిలోని ఎన్సీపీ (ఎస్‌పీ), శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌లు సన్నద్ధమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com