NDA Meeting: ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఏ కూటమి కీలక భేటీ.

ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరగనుంది.. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు మిగతా ఎన్డీఏ పక్షాల నేతల కూడా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు.. ప్రతి ఏడాది మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి పక్షాలు సమావేశం కావడం మామూలే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ప్రతి ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా, వాజ్‌పేయి శతజయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన “ప్రార్ధనా కార్యక్రమానికి” హాజరు కావాలని ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలను ఆహ్వానించామని బీజేపీ వర్గాలు చెబుతున్నమాట.. కానీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయాన్ని మరింతగా దృఢతరం చేసేందుకు జరుగుతున్న సమావేశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన నేపథ్యంలో, ఈరోజు జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు భాగస్వామ్యపక్షాల నేతల మద్దతు పూర్తిగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.. అలాగే, ఈరోజు జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు ప్రతిష్ఠాత్మక బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది..“వక్ఫ్ సవరణ బిల్లు”, “ఒకే దేశం, ఒకే ఎన్నిక” “129 వ రాజ్యాంగ సవరణ బిల్లు”పై భాగస్వామ్యపక్షాల నేతలతో అధికార ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చర్చించబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com