NDA : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేకు 324.. ఇండియా కూటమికి 208

2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన ఎన్డీయే కూటమి మళ్లీ బలంగా పుంజుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి ఏకంగా 324 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని ఇండియా టుడే-సి ఓటర్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇది 2024లో సాధించిన 293 సీట్ల కంటే బాగా ఎక్కువ కావడం గమనార్హం.
ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఈ మార్పునకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం తగ్గుముఖం పట్టనుంది. 2024లో 234 సీట్లు గెలుచుకుని ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన ఈ కూటమి, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 208 సీట్లకే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది.
కూటమిగా ఎన్డీయే బలం పెరిగినప్పటికీ, సొంతంగా బీజేపీకి మాత్రం మెజారిటీ మార్కు (272) అందడం కష్టమేనని సర్వే పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం బీజేపీ 260 స్థానాలు గెలుచుకుంటుందని, ఇది 2024లో గెలిచిన (240) సీట్ల కంటే ఎక్కువైనా, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపోదని స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే 2024లో 99 స్థానాలు గెలుచుకోగా ఇప్పుడు 97 సీట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగినట్టు తెలుస్తోంది. 2024లో 44 శాతం ఓట్లు సాధించిన ఈ కూటమికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే 46.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. మరోవైపు, ఇండియా కూటమి ఓట్ల శాతం 40.9 శాతంగా ఉండొచ్చని అంచనా. జులై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను రూపొందించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com