PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల తీరు బాధించింది

ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాల వైఖరి ఏ మాత్రం బాగోలేదన్నారు. తమకు తాము గాయం చేసుకునే విధంగా విపక్ష తీరు ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్ని కీలక విజయాలు సాధించిందని గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర స్థాపనను జ్ఞాపకం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం స్వీయ హాని కోసం పట్టుబట్టిందని వాపోయారు. ఈ చర్చ ద్వారా ప్రతిపక్షం తప్పు చేసిందన్నారు. ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్‌పై తీర్మానాన్ని చదివి వినిపించగా.. కూటమి నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారతప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ మెజారిటీని కోల్పోయింది. మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం నడుస్తోంది. మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ, ఎల్జీపీ సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. గతేడాది జూన్‌లో ఎన్డీఏ సమావేశం జరగగా.. ఇన్నాళ్లకు రెండోసారి ఎన్డీఏ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com