Ayodhya : అయోధ్య సందర్శనకు 75 లక్షల మంది

Ayodhya : అయోధ్య సందర్శనకు 75 లక్షల మంది
డిసెంబరు నాటికి నిర్మాణం పూర్తి

అయోధ్యలో రామమందిర సముదాయ నిర్మాణం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గురువారం ప్రకటించింది. జనవరి 22 నుంచి ఇప్పటి వరకు దాదాపు 75 లక్షల మంది భక్తులు మందిరాన్ని దర్శించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో 1,500 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారని, త్వరలో మరో 3,500 మందిని అదనంగా నియమించనున్నామని ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా తెలిపారు. ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కార్మికుల సంఖ్య పెంపుతో పై రెండు అంతస్తుల పనులను వేగవంతం చేస్తామని వివరించారు.

విగ్రహం ప్రతిష్ఠించిన గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నాటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఆలయ ప్రధాన గోపురం, మరో గోపుర పనులు శరవేగంగా సాగుతున్నాయి. 300 రోజుల్లో ప్రధాన గోపురం పూర్తవుతుందని పేర్కొన్నారు. మొత్తం ఐదు శిఖరాలు ఉంటాయని, 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేయిస్తామని అనిల్ మిశ్రా అన్నారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ప్రహరీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

ప్రహరీ వెంబడి ఆరుగురు దేవతామూర్తుల ఆలయాలు.. వాటి పక్కన సప్త రిషిల ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి 1,500 మంది కార్మికులతో కూడిన సైన్యాన్ని రంగంలోకి దించబోతోందని ఆయన చెప్పారు. వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మునితో పాటు నిషద్ధరాజ్, అహల్య వంటి మహారుషులు, పురాణ పురుషుల ఆలయాలను మందిర సముదాయంలో నెలకొల్పనున్నట్టు వివరించారు.


ఇది కాకుండా రామజన్మభూమి పశ్చిమ చివర బజార్ నుంచి అష్రఫీ భవన్, విభీషణ్ కుండ్ మీదుగా పోస్టాఫీసు వరకు రోడ్డును 15 మీటర్ల మేర విస్తరించనున్నారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని విస్తరిస్తున్నట్లు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ తెలిపారు. మంగళ, శని, ఆదివారాల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు రామమందిరాన్ని సందర్శిస్తున్నారని, మిగతా రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నారని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా తెలిపారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ "క్రీడా భారతి" మార్చి 10న అయోధ్యలో ‘రన్-ఫర్-రామ్’ హాఫ్ మారథాన్ నిర్వహించనుంది. అయోధ్యలో జరిగే ‘రన్-ఫర్-రామ్’ అనే హాఫ్ మారథాన్‌లో దేశ, విదేశాల నుంచి పాల్గొనే వారు పాల్గొంటారని క్రీడా భారతి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అవనీష్ కుమార్ సింగ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story