Neeraj Chopra: మళ్లీ వరల్డ్ నంబర్ వ‌న్‌ నీరజ్ చోప్రా నే .. గ్రెనడా స్టార్ ను అధిగమించి అగ్రస్థానంలోకి

Neeraj Chopra: మళ్లీ వరల్డ్ నంబర్ వ‌న్‌  నీరజ్ చోప్రా నే .. గ్రెనడా స్టార్  ను అధిగమించి అగ్రస్థానంలోకి
X
వరుస విజయాలతో 1445 పాయింట్లు సాధించిన భారత గోల్డెన్ బాయ్

భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాడు. అంతర్జాతీయ వేదికలపై వరుసగా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతూ, పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ వ‌న్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టాడు.

ఈ వారం వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా 1,445 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న అండర్సన్ పీటర్స్ 1,431 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 91.06 మీటర్ల రికార్డు త్రో విసిరిన జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మూడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో నాలుగో స్థానంలో, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్ (చెక్ రిపబ్లిక్) ఐదో స్థానంలో ఉన్నాడు.

గతేడాది సెప్టెంబర్ 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ తన నంబర్ వ‌న్‌ ర్యాంకును కోల్పోయిన విష‌యం తెలిసిందే. దాంతో పీటర్స్ అగ్ర‌స్థానాన్ని అధిరోహించాడు. ఆ ఒలింపిక్స్‌లో నీరజ్ 89.45 మీటర్ల త్రోతో రజతం గెలవగా, పీటర్స్ కాంస్య పతకం సాధించాడు. అయితే, 2025లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి వచ్చాడు. ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన పోచ్ ఇన్విటేషనల్ టోర్నీలో విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించాడు. ఆ తర్వాత దోహా డైమండ్ లీగ్‌లో తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును దాటి, 90.23 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

అదే నెలలో పోలాండ్‌లో జరిగిన జానస్ కుసోసిన్‌స్కీ మెమోరియల్ టోర్నీలోనూ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ నెలలో పారిస్ డైమండ్ లీగ్ (88.16 మీటర్లు), ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ (85.29 మీటర్లు) టోర్నీలలో వరుసగా స్వర్ణాలు గెలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.

ఈ ఏడాది పీటర్స్‌తో తలపడిన నాలుగు పోటీల్లోనూ నీరజ్ చోప్రానే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా ప్రధాన టోర్నమెంట్ల ఫైనల్స్‌లో పీటర్స్‌పై నీరజ్ 16-5 తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక‌, ఈ ఇద్దరు స్టార్ అథ్లెట్లు జులై 5న బెంగళూరులో జరగనున్న 'నీరజ్ చోప్రా క్లాసిక్' ఈవెంట్‌లో మరోసారి తలపడనున్నారు. దీంతో వీరి మధ్య పోటీపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.


Tags

Next Story