Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

Neeraj Chopra:  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం
జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ ఇప్పుడు మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం సాధించి పెట్టాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

క్వాలిఫైయర్స్‌లో నీరజ్ జావెలిన్‌ని 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. ఈటెను 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ కాంస్య పతకం సాధించాడు.



ఇదే ఫైనల్లో భారత త్రోయర్లలో కిశోర్‌ జెనా 84.77 మీటర్లు జావెలిన్ విసిరి అయిదో స్థానంలో నిలవగా, మను 84.14 మీటర్లు బల్లెం విసిరి ఆరో స్థానం దక్కించకున్నాడు. జావెలిన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత నంబర్ 1 స్థానంలో చోప్రా ఉన్నాడు. భారతదేశపు సూపర్ స్టార్ జావెలిన్ త్రోయర్ చోప్రా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన దిగ్గజ జాన్ జెలెజ్నీ, నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ తర్వాత, ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల టైటిల్‌లను ఏకకాలంలో సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు.

25 ఏళ్ల నీరజ్ కొంతకాలం పాటు గాయాలతోనూ పోరాడాడు. ఒలింపిక్స్ తర్వాత గతేడాది జరిగిన అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలిచిన నీరజ్ భుజానికి గాయమైంది. ఆ టోర్నీ ఫైనల్లో నాలుగో త్రో టైమ్‌లో కండరాల్లో చీలిక రావడంతో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పాల్గొనలేదు. తరువాత డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్ ఈ ఏడాది ఆరంభంలో మరోసారి గాయపడ్డాడు. నెలరోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. కానీ ఈ సీజన్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా గేమ్స్ కూడా ఉండటంతో ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన నీరజ్ చోప్రా.. విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. పక్క ప్లానింగ్‌తో ప్రిపేర్ అయ్యాడు. పరిమిత టోర్నీలు ఆడాడు. బంగారు పతకం పట్టాడు.

నిజానికి ఓ అథ్లెట్ తన కెరీర్‌లో ఒలింపిక్ గోల్డ్, వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌‌లో ఏదో ఒక్కటి సాధిస్తేనే గొప్పగా భావిస్తారు. కానీ నీరజ్ చోప్రా 25 ఏళ్ల వయసులోనే ఈ మూడు ఘనతలను అందుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story