NEET 2022: లోదుస్తులను తొలగిస్తేనే పర్మిషన్..! నీట్ సెంటర్‌లో అరాచకం..

NEET 2022: లోదుస్తులను తొలగిస్తేనే పర్మిషన్..! నీట్ సెంటర్‌లో అరాచకం..
NEET 2022: కేరళలోని కొల్లాం నీట్ సెంటర్ వద్ద వచ్చిన ఆరోపణలు.. పరీక్షా నిర్వాహకులపై ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేస్తున్నాయి.

NEET 2022: ఎన్నో అనుమానాలు, మరెన్నో గందరగోళాల గట్లను దాటుకొని అఖరికి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కి వచ్చి సక్సెస్ ఫుల్ గా పరీక్ష జరుపుకుంది నీట్. కానీ కేరళలోని కొల్లాం సెంటర్ వద్ద వచ్చిన ఆరోపణలు.. పరీక్షా నిర్వాహకులపై ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేస్తున్నాయి. కఠిన ఆంక్షల మధ్య నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. అమ్మాయిలు చెవి పోగులు నుంచి కాళ్లకు వేసుకొనే షూస్ వరకు అన్నింటిపై ఆంక్షలు విధించారు. సాదాసీదాగా ఎగ్జామ్ హాల్‌లోకి రావాలని సూచించారు.

ఇదంతా బాగుంది.. కానీ కొల్లాం సెంటర్ వద్ద లోదుస్తులను తొలగించిన తర్వాతే పరీక్ష హాల్ కు పర్మిషన్ ఇచ్చారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తువులను తొలగించే వరకు సిబ్బంది అనుమతి ఇవ్వలేదని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థిని తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సమాజమంతా దుమ్మెత్తిపోస్తోంది. ఇవేం రూల్స్, ఏదేం పద్ధతి అంటూ సోషల్ మీడియాలో చీవాట్లు పెడుతున్నారు. విద్యార్థులకు మానసిక మనోవేదన కలిగించే రూల్స్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై నీట్‌ నిర్వాహణ సంస్థ 'నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ' స్పందించింది. కొల్లాం సెంటర్‌ సూపరిండెంట్‌, ఇండిపెండెంట్‌ అబ్జర్వర్‌, సిటీ కో ఆర్డినేటర్‌ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అసలు అలాంటి ఘటనే జరగలేదంటూ ప్రకటించారు. మరోవైపు ఎన్‌టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్‌టీఏ డ్రెస్‌ కోడ్‌ ప్రకారం.. నీట్‌ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవని. కోడ్‌ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్‌టీఏ తెలిపింది.

రోజురోజుకు ముదురుతున్న ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం స్పందించింది. 15 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కొల్లాం రూరల్‌ ఎస్పీని ఆదేశించింది. అలాగే కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆర్‌ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఎన్‌టీఏపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. బలవంతగా విద్యార్థినుల లోదుస్తులు తొలగించారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నీట్ పరీక్షలో అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని NTA సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్‌లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే సైండిల్స్‌, ఓపెన్‌ స్లిప్పర్స్‌ వేసుకోవచ్చు. కానీ షూ ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్‌ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్‌లెట్‌, కెమెరా, నగలు, మెటాలిక్‌ వస్తువులను కూడా నిషేధించారు. అయితే మెటాలిక్‌ హుక్స్‌ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇటు హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు.

Tags

Next Story