NEET UG : పేపర్‌ లీక్‌కు రూ.30 లక్షలు:

NEET UG : పేపర్‌ లీక్‌కు రూ.30 లక్షలు:
X
కీలక విషయాలు వెల్లడించిన నిందితులు

ఒకవైపు నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్నం లీక్‌ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టీ పట్టించడానికి పేపర్‌ లీకేజీ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసింది. ఇందుకుగానూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 – 32 లక్షలు వసూలు చేసినట్టు నిందితులు పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్‌ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్‌ ఆర్థిక నేరాల విచారణ విభాగం(ఈఓయూ) నోటీసులు జారీ చేసింది.

‘నీట్‌’ దర్యాప్తులో సంచలనాలు...

నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలతో బీహార్‌ ఈఓయూ ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసింది. పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీహార్‌ ప్రభుత్వంలో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేసే సికందర్‌ కుమార్‌ యదవేందు(56).. తాను పలువురు నీట్‌ విద్యార్థుల కుటుంబాలతో ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి బేరం కుదుర్చుకున్నానని తన స్టేట్‌మెంట్‌లో అంగీకరించాడు. నితీశ్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌ అనే వ్యక్తులకు పరీక్షకు ఒకరోజు ముందే మే 4న ప్రశ్నాపత్రాలు అందాయని, పట్నాలోని రామకృష్ణానగర్‌లోని ఒక ఇంటికి విద్యార్థులను తీసుకెళ్లి ఈ ప్రశ్నాపత్రాలు ఇచ్చామని ఒప్పుకున్నాడు. విద్యార్థులకు ఈ ప్రశ్నలకు జవాబులను బట్టీ పట్టించారని, ఈ వ్యవహారం ఎక్కడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వీరే నేరుగా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల వద్ద దిగబెట్టారని పోలీసులు గుర్తించారు.

కోచింగ్‌ సెంటర్ల ముసుగులో

నితీశ్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌ కూడా పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు. ఇందుకు గానూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.30-32 లక్షలు అందుకున్నట్టు తమ స్టేట్‌మెంట్‌లలో ఒప్పుకున్నారు. వీరిలో నితీశ్‌ కుమార్‌ గతంలో బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలో అక్రమాల ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చాడు. అమిత్‌ ఆనంద్‌ పట్నాలో అనుమతి లేకుండా ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు కన్సల్టెన్సీలు, కోచింగ్‌ సెంటర్ల ముసుగులో విద్యార్థులను ఆశ్రయించి పేపర్‌ లీక్‌ చేస్తామని బేరాలు కుదుర్చుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అసలు వీరికి ప్రశ్నాపత్రాలు ఎలా లీక్‌ అయ్యాయి? లీక్‌ అయినవి అసలైన ప్రశ్నాపత్రాలేనా ? అనే దిశగా విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని బీహార్‌ ఈఓయూ అరెస్టు చేసింది. వీరిలో నలుగురు విద్యార్థులు. ఇప్పుడు మరో తొమ్మిది మంది విద్యార్థులకు ఈఓయూ నోటీసులు జారీ చేసింది. బీహార్‌లోని వేర్వేరు జిల్లాలకు చెందిన వీరిని జూన్‌ 17, 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు నీట్‌-యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags

Next Story