NEET-UG 2024: నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ నేడు
వివాదాస్పదంగా మారిన నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం నుంచి విచారణ మొదలుకానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలు విననుంది. అయితే, పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్ లీకేజీ భారీపెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
అయితే, ఇప్పటికే నీట్ యూజీ- 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక, మరోవైపు ఈ పరీక్ష క్యాన్సిల్ చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు మంచి మార్కులు వచ్చాయి.. ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 24 లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com