AIR INDIA: విమానంలో నేపాల్‌ జాతీయుడి రచ్చ

AIR INDIA: విమానంలో నేపాల్‌ జాతీయుడి రచ్చ
ఎయిరిండియా విమానంలో నానాహంగామా సృష్టించిన నేపాల్ జాతీయుడు.. లావెటరీ డోర్‌ ధ్వంసం... కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు....

విమాన ప్రయాణంలో అనుచిత ప్రవర్తన ఘటనలు ఇటీవల తరుచుగా నమోదవుతున్నాయి. కొందరు అనుచితంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందలకు గురిచేస్తున్నారు. తాజాగా టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు నానాహంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్‌ విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించి, లావేటరి డోర్‌ను ధ్వంసం చేసి ఫ్లైట్‌లో నానా రభస చేశాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.


నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణించారు. మహేష్ తన సీటును 26 E నుంచి 26 Fకి మార్చుకుని ఎకానమీ క్లాస్ సిబ్బందిని తిట్టడం ప్రారంభించాడని కేబిన్ సూపర్‌వైజర్ ఆదిత్య కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత విమానం సిబ్బందితో ఘర్షణకు దిగి, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహేశ్ పండిట్ తమను దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తించారని పైలట్ ఇన్ కమాండ్‌కు తాము చెప్పామని, అనుచితంగా ప్రవర్తించవద్దని హెచ్చరించామని తెలిపారు.


కాసేపటి తర్వాత స్మోక్ అలర్ట్ వచ్చిందని.. తాము పరిశీలించినప్పడు మహేశ్ లావెటరీలో సిగరెట్ లైటర్‌తో పట్టుబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహేశ్ ముందు ఉన్న డోర్‌ను తెరిచామని, అప్పుడు ఆయన తమను వెనుకకు నెట్టేసి, పరుగు పరుగున వెళ్లి తన సీటు 26ఎఫ్‌లో కూర్చున్నారని విమాన సిబ్బంది తెలిపారు. మహేశ్‌ను ఆపేందుకు ప్రయత్నించామని, అప్పుడు తమను తోసేసి, దూషించారని వెల్లడించారు. అనంతరం లావేటరీ డోర్‌ను మహేష్‌ ధ్వంసం చేశాడని తెలిపారు.


విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనపై తాను వెంటనే కెప్టెన్‌కు చెప్పామని ఆదిత్య కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కెప్టెన్ ఆదేశాల మేరకు తాను, కేబిన్ సిబ్బంది పునీత్ శర్మ, మరో నలుగురు ప్రయాణికులతో కలిసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మహేశ్‌ను నిలువరించేందుకు ప్రయత్నించామన్నారు. మరో పది మంది ప్రయాణికుల సహాయంతో ఆయనను నిలువరించగలిగినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా మహేశ్‌ తోటి ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించారని, అతి కష్టం మీద అతడిని ఆపగలిగామని ఫిర్యాదులో విమాన సిబ్బంది పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు మహేశ్ పండిట్‌పై ఐపీసీ సెక్షన్లు 323, 506, 336; ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 22, 23, 25 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story