Nepal PM: నేపాల్‌లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా (78), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యూనిఫైడ్ మార్క్సిస్ట్ - లెనినిస్ట్ (సీపీఎన్-యుఎంఎల్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి (72) కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని సోమవారం రాత్రి ఓ నిర్ణయానికి వచ్చారు. అయినా ప్రధాని ప్రచండ రాజీనామా చేయడానికి మంగళవారం కూడా నిరాకరించారు. రాజీనామా చేయడం కన్నా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన చెప్పారు.
రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పార్లమెంటు విశ్వాసాన్ని పొందడానికి 30 రోజుల గడువు ఉంటుంది. గత ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న ప్రచండ ఇప్పటికే మూడుసార్లు విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రచండ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును ఓలి సారథ్యంలోని సీపీఎన్-యుఎంఎల్ నాలుగు నెలల క్రితం ఉపసంహరించుకోవడంతో సర్కారు కూలిపోయే పరిస్థితి తలెత్తింది. 2024-25 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌పై అసంతృప్తితోనే ఓలి మద్దతు ఉపసంహరించారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓలి పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేయనున్నారు. ప్రచండ సంకీర్ణం కూలిపోయిన తరవాత తాము ఏర్పాటుచేసే కొత్త జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని సవరించాలని దేవ్ బా, ఓలి నిర్ణయించారు. పార్లమెంటు పదవీకాలంలో మిగిలిన మూడేళ్లకు ఉభయులూ రొటేషన్ పద్ధతిపై ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తారు. 275 సీట్లు గల నేపాల్ పార్లమెంటులో దేవ్ బా నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. ఓలి పార్టీకి వచ్చిన 78 సీట్లను కలుపుకొంటే మొత్తం 167 సీట్లతో మెజారిటీ లభిస్తుంది. సాధారణ మెజారిటీ 138 సీట్లకన్నా ఇది ఎక్కువే. నేపాల్‌లో గడచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారాయంటే అక్కడి రాజకీయాలు ఎంత అస్థిరమో అర్థం చేసుకోవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com