అట్టహాసంగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

అట్టహాసంగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
రెండు సెషన్స్‌గా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తొలి అంకం ముగిసింది. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్నఈ అధునాతన పార్లమెంటు

భారత దేశ చట్టసభలో కొత్త శకంగా నిలవనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. రెండు సెషన్స్‌గా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తొలి అంకం ముగిసింది. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్నఈ అధునాతన పార్లమెంటు భవంతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోదీ.. నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు.

అధునాతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. హోమం, పూజా కార్యక్రమాలు ఉదయం 7:15 గంటలకే ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని నడిచారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మొదట మోదీ నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని పూజలో పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల తర్వాత మఠాథిపతులు, వేదపండితులతో కలిసి కొత్త పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. సరిగ్గా అనుకున్న సుముహూర్తం ప్రకారమే ప్రధాని మోదీ.. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. స్పీకర్‌తో కలిసి లోక్‌సభ చాంబర్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. స్పీకర్‌ కుర్చీ దగ్గర రాజదండం ప్రతిష్టించారు. అనంతరం పార్లమెంట్ లాబీల్లో సర్వమత ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల తర్వాత పాత పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు ప్రధాని.

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ రెండో సెషన్ ఉదయం 11గంటల 30నిమిషాలకు ప్రారంభమవుతుంది. కొత్త పార్లమెంట్‌లో జాతీయ గీతాలాపన అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్క సందేశాలను హరివంశ్‌ చదివి వినిపిస్తారు. మధ్నాహ్నం 12:30 గంటలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రసంగిస్తారు. ప్రతిపక్ష నేత ప్రసంగం తర్వాత లోక్‌సభ స్పీకర్‌ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 5 నిమిషాలకు కొత్త 75 నాణెంను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం స్మారక స్టాంపులను విడుదల చేస్తారు. అనంతరం మధ్నాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల సీఎంలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామితో పాటు ఇతర ముఖ్యమంత్రులు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు తరలివచ్చారు.

రూ.970 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్లలో త్రికోణాకారంలో.. అతి తీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా లోక్‌సభ నెమలి థీమ్, రాజ్యసభ తామరపువ్వు థీమ్‌తో ఈ భవనాన్ని నిర్మించారు. 1,274 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా పార్లమెంట్ నిర్మాణం చేశారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభ 384 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్‌ ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేశారు. ద్వారాల పక్కన భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలు ఏర్పాటు చేశారు.

Tags

Next Story