FASTag Recharge: వాహనదారులు ఈజీగా రూ. 1000 పొందే ఛాన్స్.. ఎలా అంటే

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తే, దానిని ఒక ఫొటో తీసి పంపితే చాలు.. మీ ఫాస్టాగ్ ఖాతాలో రూ.1000 బహుమతిగా జమ అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతను పెంచే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ బహుమతిని పొందాలనుకునే ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని 'రాజ్ మార్గ్ యాత్ర' యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా వద్ద అపరిశుభ్రంగా కనిపించిన మరుగుదొడ్డిని ఫొటో తీసి, దానిని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫొటోతో పాటు తమ పేరు, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, లొకేషన్ వంటి వివరాలను కూడా నమోదు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.
ఇలా వచ్చిన ఫొటోలలో అర్హత ఉన్నవాటిని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపికైన ఫిర్యాదుదారుడి వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు అనుసంధానమై ఉన్న ఫాస్టాగ్ ఖాతాకు రూ.1000 రీఛార్జి రూపంలో జమ చేయబడుతుంది. అయితే, ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతను ప్రోత్సహించడంతో పాటు, మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com