NIA: ఖలిస్థాన్ ముఠాలపై ఉక్కుపాదం..

ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా ఖలిస్థాన్ మద్ధతుదారులను అదుపులోకి తీసుకొనే లక్ష్యంతో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఆరు రాష్ట్రాల్లోని 53 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకుంది. ఆయుధాలు, మందుగుండు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది.
దేశంలో ఖలిస్థానీలు-గ్యాంగ్‌స్టర్ల మధ్య బంధం ప్రమాదకరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. బ్రిటిష్ కొలంబియాలో జూన్ 18న ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేయడంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, తర్వాత భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడం లాంటి పరిణామాల నడుమ ఇప్పుడు ఎన్‌ఐఏ దాడులు జరిగాయి.
ఆరు రాష్ట్రాల్లో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని NIA సోదాలు నిర్వహించింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ, చండీగఢ్‌లోని 53 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో ఈ దాడులకు దిగారు. పంజాబ్ మోగా జిల్లాలోని టఖ్తుపురా గ్రామంలో మద్యం కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలు చేశారు. ఖలిస్థాన్ మద్ధతుదారు అర్ష్ డాలా డిమాండ్ మేరకు ఆ కాంట్రాక్టర్ కొంత మొత్తం డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఈ విషయమై NIA దర్యాప్తు చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని ఒక ఇంటిలో, దెహ్రాదూన్ జిల్లాలోని క్లెమన్‌టౌన్ ప్రాంతంలోని మరో ఇంటిలోనూ సోదాలు చేశారు. బుధవారం జరిపిన సోదాల్లో తుపాకులు, మందుగుండు, డిజిటల్ పరికరాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు NIA అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆయుధాల సరఫరాదారులపై కూడా NIA దృష్టిసారించింది. పాకిస్తాన్, కెనడా, పోర్చుగల్‌లో ఉన్న ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న ముఠాలకు సంబంధించిన 43 మంది వ్యక్తులపైనా NIA ఇప్పటికే దృష్టి పెట్టింది. ఈ మేరకు వారి వివరాలను ఫోటోలతో సహా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇటీవల పోస్ట్ చేసిన NIA..... ఆయా వ్యక్తుల ఆస్తులు, ఆదాయాల వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలను కోరింది. కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆయా ఆస్తుల వివరాలను అందించాలని విజ్ఞప్తి చేసింది. పోస్ట్ చేసిన చిత్రాల్లో ఉన్న ముఠా సభ్యుల్లో చాలా మంది కెనడాలోనే ఉన్నారు. చండీగడ్, అమృత్‌సర్‌లో ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుకు చెందిన ఆస్తులను ఇప్పటికే NIA జప్తు చేయగా గతంలో 370 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన NIA...38 ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. 87 బ్యాంక్ ఖాతాలను జప్తు చేసింది. 13 ప్రాపర్టీలను అటాచ్ చేసింది. 331 డిజిటల్ డివైజ్‌లను, 418 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com