Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆస్తులు జప్తు!

Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆస్తులు జప్తు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలీస్థానీ ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలీస్థానీ ఉగ్రవాదులపై తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపేందుకు భారతదేశం సంసిద్ధం అయింది. కెనడా, పాకిస్తాన్, యూకే, అమెరికాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, పంజాబ్ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల అణిచివేత ప్రారంభించింది. కెనడా-ఇండియాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దౌత్య వివాదానికి కారణమైంది, ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పరారీలో ఉన్న 19 మంది ఖలీస్థానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసింది.

ఇప్పటికే యూఎస్ఏలో ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ కు సంబంధించి పంజాబ్ లో ఉన్న అతడి ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అంటే ఈ రోజు ఎన్ఐఏ యూకే, అమెరికా, కెనడా, దుబాయ్ లో ఉంటున్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసింది. భద్రతా సంస్థలు వీరిని ఏళ్ల తరబడి వెంబడిస్తూ ఉన్నాయి. వీరిపై కఠినమైన యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. ఖలీస్థాన్ వాదంతో చలామణిలో ఉన్న పలువురు నేతలు కెనడా, దుబాయ్, బ్రిటన్, అమెరికా, పాకిస్థాన్ ఇతర దేశాలలో ఉన్నారు.


వీరికి చెందిన భారత్‌లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది.ఈ జాబితాలో ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్న పరంజిత్ సింగ్ పమ్మ, పాకిస్థాన్‌లో తలదాచుకున్న వాద్వా సింగ్ బాబ్బర్ అలియాస్ చాచా , యుకెలోని కుల్వంత్ సింగ్ ముత్రా, అమెరికాలో ఉన్న జై ధాలీవా, యుకెలోని సుఖ్‌పాల్ సింగ్, యుఎస్‌లోని హర్ప్రీత్ సింగ్ అలియాస్ రానా సింగ్, యుకెలోని సరబ్జిత్ సింగ్, యుకెలోని కుల్వంత్ సింగ్ అలియాస్ కాంటా , కాలీఫోర్నియాలో ఉంటున్న హర్జప్ సింగ్ అలియాస్ జప్పి సింగ్ వంటి మొత్తం 19 మంది ఉన్నారు. కేవలం కెనడాలోనే కాకుండా వీరిలో అత్యధికులు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది.

ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇంటిని, అమృత్‌సర్ లోని అతని వ్యవసాయ భూమిని ఎన్ఐఏ జప్తు చేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఇతనిపై మూడు దేశద్రోహ కేసులతో సహా 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటీవల కెనడా వివాదం మొదలైన తర్వాత కూడా ఇతను కెనడా హిందువులు కెనడాని వదిలి భారత్ దేశం వెళ్లాలని బెదిరించాడు.

పంజాబ్‌ను స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు, బహిరంగంగానే భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ ఎస్‌జేఎఫ్‌ ఏర్పడింది. ఈ సంస్థపై 2019 జూలై 10న కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

Tags

Read MoreRead Less
Next Story