Kerala: నిపా వైరస్ కలకలం

Kerala: నిపా వైరస్ కలకలం
ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇద్దరు మృతి

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుతోంది . దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. 2018,2021 సంవత్సరాల్లో కోజికోడ్ జిల్లాల్లో నిపా వైరస్ సంక్రమణ కారణంగా పలువురు మరణించారు. నిపా వైరస్ మొదటికేసు 2018 మే 19వతేదీన ఇక్కడే నమోదైంది. కోజికోడ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు.


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాపించినట్లు రుజువైంది. గత కొన్నేళ్లువేలకొద్దీ గబ్బిలాలను పరీక్షించినప్పుడు, వాటిల్లో అనేక రకాల వైరస్‌లను కనుగొన్నారు. వాటిల్లో అధిక శాతం కరోనావైరస్‌లే ఉన్నా మానవులకు అత్యంత ప్రమాదకరమైన మరికొన్ని వైరస్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో నిపా వైరస్ ముఖ్యమైనది. ఫ్రూట్ బ్యాట్స్ అనే గబ్బిలాల జాతిలో ఇది సహజంగా కనిపిస్తుంది. నిపా వైరస్ మరణాల రేటు 40% నుంచీ 75% వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేదానిపై మరణాల రేటు ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైరస్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతీ ఏడాదీ డబ్ల్యూహెచ్ఓ..పెద్ద ఎత్తున అంటువ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను సమీక్షిస్తుంది. అత్యధిక స్థాయిలో ప్రమాదాన్ని కొనితెచ్చే వాటికి, ఇప్పటివరకూ వ్యాక్సీన్ లేనివాటికి ప్రాధాన్యత ఇస్తూ వాటిపై పరిశోధన, నివారణ చర్యలకు నిధులను కేటాయిస్తుంది. అలా డబ్ల్యూహెచ్ఓ తయారుచేసిన జాబితాలోని మొదటి పది వైరస్‌లలో నిపా వైరస్ కూడా ఉంది.


నిపా వైరస్‌ను ఇంత ప్రమాదకారిగా పరిగణించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వైరస్ సోకిన తరువాత వ్యాధి లక్షణాలు బయటపడడానికి 4 నుంచీ 14 రోజులు పడుతుంది. ఒక ప్రత్యేక కేసులో 45 రోజులు పట్టిందని సమాచారం. అంటే నిపా వైరస్ సోకినవారు, ఆ విషయం తెలుసుకునేలోపే మరి కొందరికి వ్యాపింపజేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వైరస్ అనేక రకాల జంతువులకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే వాటన్నిటి ద్వారా కూడా మనుషులకు సోకే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా ఒకరినుంచీ ఒకరికి సోకవచ్చు లేదా వైరస్‌తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా వ్యాపించవచ్చు. నిపా వైరస్ సోకినవారికి శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, మెదడువాపు రావొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story