Nipah Virus: కేరళలో హడలెత్తిస్తున్న నిపా వైరస్, కేంద్రం అప్రమత్తం

కేరళలో ఓ 14 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలితీసుకున్న ‘నిపా’ వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మరణం నిపా వైరస్ కారణంగానే సంభవించిందని ధృవీకరించుకున్న వెంటనే కేరళకు వైద్య బృందాన్ని పంపించింది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. కేరళ రాష్ట్రానికి ఆ మేరకు సూచనలు జారీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. కేస్ ఇన్వెస్టిగేషన్, వ్యాధి సంక్రమణ విస్తృతిని గుర్తించేందుకు సాంకేతిక సహాయాన్ని అందించనుంది.
కేరళలోని మల్లాపురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైంది. మల్లాపురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆ వ్యాధి లక్షణాలతో బాధపడుతుండడంతో కోజికోడ్‌లోని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించే ముందు పెరింతల్‌మన్నలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో చేర్చారు. అయితే ఆ వ్యాధి తీవ్రత కారణంగా బాలుడు మృతి చెందాడు. అప్పటికే రక్తం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా ‘నిపా’ వైరస్ సోకినట్లు ల్యాబ్ టెస్టులో తేలింది. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ నిపుణులైన వైద్య బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించింది.
ఏమిటీ వైరస్?
ఈ వైరస్‌ను తొలిసారి 1999లో గుర్తించారు. ఇది ‘ఫ్రూట్ బ్యాట్’ అనే గబ్బిలాల్లో ఉంటుంది. వాటి నుంచి ఇతర జంతువులకు, మనుషులకు సోకుతుంది.
వైరస్ ఉన్న గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా, వాటి లాలాజలం లేదా అవి వాలిన ఆహార పదార్థాల (పండ్లు) ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
ఒకసారి మనుషులకు సోకితే.. వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది.
లక్షణాలు
వైరస్ సోకిన వాళ్లలో తొలుత జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సరైన చికిత్స అందకపోతే, శ్వాస సంబంధిత సమస్యలు, నిమోనియా ఏర్పడతాయి. రోగి మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లిపోతాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com