ICMR: నిఫా... అత్యంత ప్రమాదకరమైన వైరస్

కేరళలోని కోజీకోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్న క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్- ICMR స్పందించింది. కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి ICMR హెచ్చరించింది. కొవిడ్ కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని స్పష్టం చేసింది. కొవిడ్ వల్ల మరణాల రేటు 2 నుంచి 3 శాతం ఉంటే నిఫా వైరస్ వల్ల 40 నుంచి 70 శాతం వరకు ఉంటుందని హెచ్చరించింది.
నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమని ICMRడీజీ డాక్టర్ రాజీవ్ బహల్ హెచ్చరించారు. కరోనా వైరస్ సోకిన ప్రతీ వంద మందిలో ఇద్దరి నుంచి ముగ్గురు చనిపోయే అవకాశాలు ఉంటే నిఫా వైరస్ సోకిన ప్రతీ వంద మందిలో 40 నుంచి 70 మరణాలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. నిఫా వైరస్ సోకకుండా ఉండాలంటే కరోనాకు తీసుకున్న జాగ్రత్తలనే పాటించాలని బహల్ పేర్కొన్నారు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నోరు, ముక్కుకు మాస్కు ధరించడం, రోగికి దూరంగా ఉండటం, వారి చెమట, రక్తానికి తాకకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిఫాలో మరణాల రేటు పెరుగుదల చాలా ఆందోళనకరంగా ఉంటుందని ICMR హెచ్చరించింది. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా సోకుతుందని, కాబట్టి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం మంచిదని సూచించింది.
కేరళలో తాజాగా కొజీకోడ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ కేసుతో వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆ రాష్ట్రంలో ఆరుకు పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. యాక్టివ్ కేసుల సంఖ్య4కు చేరింది. శుక్రవారం విద్యాసంస్థలకు కోజీకోడ్ యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించారు. కాగా గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com