Nirmala Sitharaman: బడ్జెట్ ప్రసంగాల్లో రెండవ అతి చిన్నది ఇదే

Nirmala Sitharaman: బడ్జెట్ ప్రసంగాల్లో రెండవ అతి చిన్నది ఇదే
X
గంటా 25 నిమిషాలలోనే

సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో చదివి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ పలు రికార్డులను బ్రేక్‌ చేశారు. వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆరుసార్లు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ రికార్డును బ్రేక్‌ చేశారు.

ఇక చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం 85 నిమిషాలు మాత్రమే బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఉదయం 11గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ 12:25కు తన ప్రసంగాన్ని ముగించారు. ఇప్పటి వరకూ నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే రెండో అతి తక్కువ బడ్జెట్‌ ప్రసంగంగా నిలిచింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్మలమ్మ కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాల్లో కల్లా ఇదే అతి చిన్నది. ఆ తర్వాత ఇవాళ ప్రసంగమే.

ఇక ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలమ్మకు రికార్డు ఉంది. ఆమె బడ్జెట్‌ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్‌ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్‌లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్‌ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు.

బడ్జెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన 2019లో ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అతిపెద్ద బడ్జెట్‌ ప్రసంగం. ఆ ఏడాది కేంద్ర బడ్జెట్ ను తొలిసారిగా పూర్తిస్థాయిలో నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. ఇక గతేడాది 87 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారు. గతేడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌ ప్రసంగం రెండు నిమిషాలు తక్కువ.

Tags

Next Story