Nitin Nabin:ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ సమక్షంలో నితిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేడీ నడ్డా సహా ఎంపీలు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలు జరిగాయని తెలిపారు. "ప్రభుత్వ అధినేతగా నాకు ఎంత అనుభవం ఉన్నా, అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఈ విషయంలో గర్వపడతాను" అని మోదీ అన్నారు. "వికసిత భారత్ నిర్మాణానికి రానున్న 25 ఏళ్లు చాలా కీలకం. ఈ ముఖ్యమైన సమయంలో నితిన్ నబిన్ పార్టీని ముందుకు నడిపిస్తారు. ఆయన ఒక మిలీనియల్ (జనరేషన్ వై... జెన్ జెడ్ కు ముందు తరం), యువ శక్తితో పాటు సంస్థాగత అనుభవం కూడా ఉంది" అని ప్రధాని ప్రశంసించారు.
అటల్ జీ, అద్వానీజీ నుంచి జేపీ నడ్డా వరకు పార్టీ అధ్యక్షులుగా చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. నాయకులు మారినా పార్టీ సిద్ధాంతాలు, దిశ మారవని స్పష్టం చేశారు. అనంతరం మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన యువకుడైన నితిన్ నబిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చరిత్రాత్మకమని అన్నారు. పార్టీకి మార్గనిర్దేశం చేసిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒక్కరే నామినేషన్ వేయడంతో బీజేపీ జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్ నితిన్ నబిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
నితిన్ నబిన్..
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్ నబిన్‌కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
