Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలపై వరాలు

Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలపై వరాలు
X
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో యువతకు సాధికారత కల్పించడానికి బీహార్ యువజన కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. యువతను నైపుణ్యం కలిగినవారిగా మార్చడం ఈ కార్యక్రమాల లక్ష్యం అని చెప్పారు. యువజన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అన్ని వర్గాల మహిళలకు.. ఆయా స్థాయిలకు రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు వైస్-చైర్‌పర్సన్‌లు, ఏడుగురు సభ్యులు ఉంటారు. 45 ఏళ్లలోపు వారే ఉంటారు. రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న బీహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.

రాష్ట్రంలో మొత్తం యువత ఓట్లే అధికంగా ఉన్నాయి. దాదాపు 90 శాతం యువత ఓట్లే ఉన్నాయి. యువతే లక్ష్యంగా నితీష్ కుమార్ సర్కార్ హామీలు గుప్పిస్తోంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ సర్కార్ పథకాలు ప్రకటిస్తోంది.

ఇక తాజాగా కేంద్రం కూడా బీహార్‌పై వరాల జల్లు కురిపించింది. బీహార్ రైల్వే అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌కు 4 కొత్త అమృత్ భారత్ ట్రైన్లు నడపబోతున్నట్లు చెప్పారు. రూ.2000 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 104 కిలోమీటర్ల బక్తియార్పూర్ – రాజ్‌గిర్ – తిలైయా రైలు మార్గ డబులింగ్‌కు నిధులు మంజూరు చేశారు. ఈ రైలు మార్గ విస్తరణతో ప్రయాణికులకు లాభం జరగనుంది. ఇక స్థానికులకు కూడా ఉపాధి దొరకనుంది.

బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇంక్‌ఇన్‌సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మరోసారి అధికార ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలిపింది. దాదాపు 48.9 శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Tags

Next Story