Bihar: ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్ ఎక్కడంటే ?

Bihar:  ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్ ఎక్కడంటే ?
X
రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఇకపై అనుమతి లేకుండా ఖాతాలను సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఏదైనా పాలసీపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. అనామక లేదా నకిలీ ఖాతాలను ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఎక్కువ కావడంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడటానికి ఈ నియమం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేబినెట్ మార్గదర్శకాల ప్రకారం.. బీహార్‌లోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు వారి సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు కంటెంట్‌ను సృష్టించడం కచ్చితంగా నిషేధించబడింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనికి లేదా కార్యాలయానికి సంబంధించిన కంటెంట్‌ను సృష్టించడం కూడా కచ్చితంగా నిషేధించారు. ‘‘ఏదైనా రకమైన రీల్, వీడియో, ఫొటో లేదా ప్రత్యక్ష సంభాషణను ప్రసారం చేయడం నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు తరచుగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయని.. కార్యాలయ గోప్యతను ఉల్లంఘిస్తాయి..’’ అని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ విధానాలు, పథకాలు లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయాలపై ఏ ఉద్యోగి కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారు. దీనిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కఠినమైన శిక్ష విధించబడుతుంది.

Tags

Next Story