Nitish Kumar: ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ

Nitish Kumar: ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ
X
కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ జేడీయూ తీర్మానం

బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్‌ (యునైటెడ్‌) డిమాండ్‌ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం సీఎం నీతీశ్‌ కుమార్‌ చాన్నాళ్ల నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన తర్వాత ఇప్పుడు ఆ స్వరంలో మార్పు రావడం గమనార్హం.

ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా సరిపోతుందని తీర్మానం చేయడంతో హోదా విషయంలో జేడీయూ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో జేడీయూ తీర్మానాలు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో కఠినచట్టం చేయాలని కోరింది. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ సంజయ్‌ కుమార్‌ ఝా ఎంపికయ్యారు. గతంలో ఝా.. భాజపాలో పనిచేశారు. కాషాయ పార్టీలోని కీలక నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఈ అనుభవం.. రానున్న రోజుల్లో భాజపాతో మరింత సమన్వయంతో పనిచేసేందుకు ఉపకరిస్తుందని భావించే సంజయ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నీతీశ్‌ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమితో సంబంధాలు తెంచుకొని భాజపాతో జేడీయూ జతకట్టడం వెనక కూడా ఝా కీలకపాత్ర పోషించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ప్రత్యేక హోదాపై ఝా మాట్లాడుతూ ‘‘పేరు ఏదైనా మాకు సాయం కావాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం’’ అని పేర్కొన్నారు.

Tags

Next Story