Nitish Kumar : ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం

బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు, ప్రతిపక్ష ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదవ సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జత కట్టడంపై స్పందిస్తూ... ఈసారి తాము కలిసి ఉండబోతున్నామని అన్నారు. ‘‘ఈ మహాకూటమిలోకి నేను ఏవిధంగా వచ్చానో మీకు తెలుసు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎలా పనిచేశానో మీ అందరికీ అవగాహన ఉంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మంచిగా అనిపించలేదు. అవి నా పార్టీలో ఉన్నవారికి కూడా రుచించలేదు’’ అని నితీశ్ అన్నారు. ‘‘నేను గతంలో కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాను. వేర్వేరు మార్గాల్లో వెళ్లినప్పటికీ తిరిగి మళ్లీ కలిశాం. ఇకపై కలిసి ఉంటాం. ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మిగిలినవారు త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా నియమితులయ్యారు’’ అని నితీశ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీశ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, డిప్యూటీ సీఎంలుగా.. మరో బీజేపీ నేత ప్రేమ్ చంద్, జేడీయూ సభ్యులు విజయ్ కుమార్, విజేంద్ర యాదవ్, శ్రావణ్ కుమార్‌తోపాటు జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం పార్టీకి చెందిన సంతోష్ కుమార్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. అర్జేడీ ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయగా.. కాంగ్రెస్ గైర్హాజరయింది.
నితీష్ కుమార్ 2022 జులైలో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాకూటమిలో చేరి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బీహార్ బీజేపీలో కీలకంగా ఉన్న సుశీల్ కుమార్ మోదీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో నాడు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీ స్థానంలో ప్రస్తుతం బీజేపీ నుంచి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com