Nitish Kumar: బిహార్‌లో మరో వివాదం.. ముస్లిం మంత్రితో కలిసి ఆలయంలోకి వెళ్లిన సీఎం..

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక ముస్లిం మంత్రితో కలిసి గయలోని విష్ణుపద్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. నితీష్‌ను తప్పుపడుతూ బీజేపీ విమర్శలు గుప్పించింది. గయలో అధికారిక పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి.. తనతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరిని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు
ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఇజ్రాయిల్ మన్సూరి చెప్పారు. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఓ బోర్డు కూడా ఉంది. ఈ విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని, అయినప్పటికీ ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆలయ వర్గాలు, పూజాలు ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
మరోవైపు ఈ ఘనటపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిసీ… మంత్రి నిబంధనలను బేఖాతరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సెక్యులర్ వాదంపై నితీష్ కుమార్‌కు అంతగా నమ్మకం ఉంటే మక్కాకో, మదీనాకో వెళ్లి నమాజ్ చేసుకోవచ్చని బీజేపీ రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రతినిధి నిఖిల్ ఆనంద్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసాలు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ నితీష్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com