Quick Commerce: ఇకపై నో 10 మినిట్స్ డెలివరీ.. డెలివరీ బాయ్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్

డెలివరీ రంగంలో తీవ్ర విమర్శలకు దారితీసిన '10 నిమిషాల డెలివరీ' విధానానికి ముగింపు పడనుంది. డెలివరీ పార్ట్‌నర్ల (గిగ్ వర్కర్లు) భద్రత, సంక్షేమంపై వెల్లువెత్తిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థలు ఈ వేగవంతమైన డెలివరీ హామీని ఇకపై తమ యాడ్స్‌లో, బ్రాండింగ్‌లో ఉపయోగించకూడదని నిర్ణయించాయి.
వివరాల్లోకి వెళితే, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం న్యూఢిల్లీలో క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గడువులోగా డెలివరీ చేయాలనే తీవ్ర ఒత్తిడితో డెలివరీ సిబ్బంది రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. డెలివరీ సమయానికి సంబంధించిన కఠిన నిబంధనలను తొలగించాలని ఆయన కోరారు. మంత్రి సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించి, ఈ హామీని స్వచ్ఛందంగా తొలగిస్తామని హామీ ఇచ్చాయి.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే, ప్రముఖ సంస్థ బ్లింకిట్ తన బ్రాండింగ్‌ను మార్చేసింది. '10,000కు పైగా ఉత్పత్తులు 10 నిమిషాల్లో డెలివరీ' అనే పాత ట్యాగ్‌లైన్‌ను తొలగించి, దాని స్థానంలో '30,000కు పైగా ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే' అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను చేర్చింది. ఈ మార్పు ద్వారా డెలివరీ వేగం కంటే సేవల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంకేతాలిచ్చింది.
గత కొంతకాలంగా '10 నిమిషాల డెలివరీ' విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమ భద్రత, వేతనాల గురించి గిగ్ వర్కర్ల యూనియన్లు, ముఖ్యంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) వంటి సంస్థలు ఆందోళనలు, సమ్మెలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జోక్యం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్లింకిట్ బాటలోనే జెప్టో, స్విగ్గీ, జొమాటో వంటి ఇతర సంస్థలు కూడా రానున్న రోజుల్లో తమ బ్రాండింగ్‌లో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

