RBI Policy: రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. ఈఎంఐ దారులకు నిరాశ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పాలసీ రెపో రేటును ప్రస్తుతమున్న 5.25 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో పాటు తమ 'న్యూట్రల్ మానిటరీ పాలసీ' వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గత డిసెంబర్ సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు పెరిగినప్పటికీ, ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే, వృద్ధికి ఆటంకం కలగకుండా సమతౌల్యం పాటించడమే 'న్యూట్రల్' వైఖరి ఉద్దేశమని వివరించారు.
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఆర్బీఐ నిర్దేశించిన సహన పరిమితి కంటే తక్కువగా ఉందని మల్హోత్రా పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలకు సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాలను వరుసగా 4 శాతం, 4.2 శాతానికి సవరించినట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయని, దేశీయ అంశాలే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
గత డిసెంబర్‌లో జరిగిన సమీక్షలో వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ రెపో రేటును 5.5 శాతం నుంచి 5.25 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆగస్టు, అక్టోబర్‌లలో రేట్లను స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం రేట్లలో మార్పు లేనందున గృహ, వాహన రుణాలతో సహా ఇతర రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
