Bihar Political : అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

Bihar Political : అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
బీహార్ లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ..

మహాకూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. బల నిరూపణ దిశగా అడుగులు వేస్తోంది. బిహార్‌ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం ఎన్‌డీఏలో చేరి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్‌ కుమార్‌ సోమవారం తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో నితీశ్‌తో పాటు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మంది మంత్రులూ పాల్గొన్నారు. . ఇప్పటికే నితీశ్ దెబ్బకు కుదేలైన ఆర్జేడీకి.. ఈడీ రూపంలో చిక్కులు వెంటాడుతున్నాయి.

ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాకూటమితో బిహార్‌లో ప్రభుత్వం నడిపించిన జేడీయూ చీఫ్ నితీశ్.. అనూహ్యంగా ఎన్డీయేలో చేరిపోయారు. అనుకున్న వెంటనే రాజీనామా చేయడం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే బిహార్‌లోని ఎన్డీయే సర్కారు బల నిరూపణకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సోమవారం 8 మంది మంత్రులతో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు నితీశ్‌కుమార్.

డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో పాటు మిగతా మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 5 నుంచి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించింది నితీశ్ కేబినెట్. ప్రస్తుత స్పీకర్‌ను తొలగించి ఆ పదవికి బీజేపీ సభ్యుడిని ఎన్నుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ప్రస్తుత బీహార్‌ అసెంబ్లీలో ఎన్‌డీఏకు 128 మంది సభ్యుల బలం ఉంది. ఈ కూటమికి మేజిక్‌ మార్కు కంటే ఆరుగురు సభ్యుల బలం అధికంగా ఉంది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మహాఘట్‌బంధన్‌కు 114 మంది సభ్యులున్నారు.

అధికారం కోల్పోవడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో పడ్డ ఆర్జేడీకి.. ఈడీ విచారణ మరింత ఇబ్బందికరంగా మారింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఈనెల 19న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం లాలూ.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లాలూ కుమార్తె మిసా భారతి కూడా లాలూతోపాటు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే బిహార్‌లో అధికారం కోల్పోవడం.. మరోవైపు లాలూ కుటుంబం మొత్తం ఈడీ విచారణ ఎదుర్కొంటుండం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story