No-Confidence Motion: ప్రధాని మౌన వ్రతాన్ని భంగం చేసేందుకే...

ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడరాదనే మౌన వ్రతాన్ని చేపట్టారని... ఆ వ్రతాన్ని భగ్నం చేసేందుకే అవిశ్వాస తీర్మానాన్ని(No-Confidence Motion) ప్రతిపాదించామని ప్రతిపక్ష ఇండియా కూటమి డిమాండ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress' Gaurav Gogoi ) ప్రారంభించారు. కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. మణిపుర్ తగులబడుతోందంటే భారత్ తగులబడినట్లేనని గొగోయ్ అన్నారు. మణిపుర్ సీఎం బిరేన్ సింగ్‌ను పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
రెండువర్గాల మధ్య ఘర్షణలు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్ కు ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi ) స్వయంగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని అసలు విషయాలపై మాట్లాడకుండా ఇండియా కూటమిపై విమర్శలు చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ ఆక్షేపించారు. ప్రజా సమస్యలపై మోదీ మౌనం కొత్తేమీ కాదన్నారు. సాగుచట్టాలపై రైతులు ఆందోళన చేసినపుడు మౌనంగానే ఉన్నారని, అదానీపై విమర్శలు వచ్చినపుడు మౌనంగానే ఉన్నారని ఆక్షేపించారు. చైనా బలగాలు భారత్ లోకి వచ్చినపుడు, పుల్వామా ఘటన సమయంలో కూడా మోదీ మౌనంగానే ఉన్నారని గుర్తు చేశారు.
అనంతరం చర్చలో పాల్గొన్న ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే(NCP MP Supriya Sule) కేంద్ర, మణిపుర్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. మణిపుర్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇంతటి విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపుర్ ప్రభుత్వం సిగ్గుచేటైన తప్పిదాలు చేసిందని మండిపడ్డారు. మణిపుర్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. మణిపుర్‌లో 179 మంది ప్రజలు మరణించారని, 60 వేల మంది నిరాశ్రయులయ్యారని, 350 సహాయ శిబిరాల్లో ఇప్పటికీ 40 వేల మంది ఉన్నారని సూలే సభకు తెలిపారు. 3,662 ఇళ్లను, 321 ప్రార్థనా మందిరాలను తగులబెట్టారని, అల్లర్లు, హత్యలు, అత్యాచారం కేసులు 10 వేలకుపైగా నమోదయ్యాయని ఇవన్నీ పట్టించుకోకుండా ఎలా ఉంటామని నిలదీశారు. మణిపుర్‌లో అక్కడి ప్రభుత్వమే పెద్ద సమస్యని విమర్శించారు.
బాధ్యత గల ఇండియా కూటమి ఎంపీలు మణిపుర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను చూసి ఆవేదన చెందారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ టీఆర్ బాలు(DMK member TR Baalu) తెలిపారు. మణిపుర్ గురించి ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోలేదని లోక్ సభలో ఆయన ధ్వజమెత్తారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఏర్పడిన పరిస్థితులే ఇప్పుడు మణిపుర్ లో కనిపిస్తున్నాయన్నారు. మైనారిటీలపై మెజారిటీల అణచివేత కొనసాగుతోందనీ అయినా ప్రధాని పట్టించుకోలేదని ఆక్షేపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com