G20 Summit: ఈ మూడురోజులు ఢిల్లీ వాసులు వండుకోక తప్పదు

G20 Summit: ఈ మూడురోజులు ఢిల్లీ వాసులు వండుకోక తప్పదు
స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ డెలివరీలపై ఆంక్షలు

మనం ఇంటిలో ఉండి సెల్‌ఫోన్‌ నుంచే అన్నీ ఆర్డర్ చేసుకోవడానికి అలవాటు పడిపోయాం. తినే తిండి నుంచి కట్టే బట్ట దాకా అన్నీ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు 3 రోజులపాటు ఢిల్లీవాసులకు అలాంటి అవకాశం లేదు. జీ 20 శిఖరాగ్ర సదస్సు నిఘా ఏర్పాటల్లో భాగంగా ఆన్‌లైన్ డెలివరీ, క్లౌడ్ కిచెన్‌లను ఈనెల 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో పూర్తిగా బంద్ చేయనున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9, 10 వ తేదీల్లో జరిగే ఈ జీ 20 దేశాధినేతల సదస్సుకు 20 దేశాల అధినేతలు, ఇతర ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా అణువణువునా సీసీటీవీ కెమెరాలతో 24X7 నిఘా ఏర్పాటు చేశారు.


ఇందులో భాగంగానే ఆన్‌లైన్ డెలివరీ, క్లౌడ్ కిచెన్‌లను ఈనెల 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో పూర్తిగా బంద్ చేయనున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో సేవలపై పూర్తిగా నిషేధం విధించారు. ఇక ఈ కామర్స్‌ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థల డెలివరీలను కూడా పూర్తిగా బంద్ చేశారు. ఢిల్లీలోని ఎన్‌డీఎమ్‌సీ ప్రాంతంలో డెలివరీ సేవలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఈ నెల 7 వ తేదీ అర్ధరాత్రి నుంచి 10 వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ఈ నెల 7 వ తేది అర్ధరాత్రి నుంచి 10 వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వచ్చే వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్‌ స్పెషల్‌ కమిషనర్‌ వెల్లడించారు.

మరోవైపు ఈ జీ 20 సదస్సు నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వ తేదీ వరకు పబ్లిక్‌ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నెల 9, 10 వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవును కూడా ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీ 20 సమావేశాలకు సంబంధించి అతిథులు, అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించారు.

Tags

Read MoreRead Less
Next Story