ARMY: పాక్‌ డ్రోన్లకు మౌంటెడ్‌ గన్‌లతో చెక్‌

ARMY: పాక్‌ డ్రోన్లకు మౌంటెడ్‌ గన్‌లతో చెక్‌
పాక్‌ డ్రోన్లను నేలకూల్చేందుకు ఇండియన్‌ ఆర్మీ కొత్త వ్యూహం... సర్వ సన్నద్ధంగా బలగాలు

భారత్‌ను నేరుగా ఢీకొట్టలేని పాకిస్థాన్‌ దేశంలో విధ్వంసానికి ఉగ్రమూకలను ఉసిగొల్పుతుంటుంది. వారికి కావాల్సిన ఆయుధాలను డ్రోన్ల ద్వారా సరిహద్దులు దాటించి ముష్కరులకు అందించేందుకు యత్నిస్తుంటుంది. గగన మార్గంలో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలను అక్రమ సరఫరా చేస్తూ.... దేశ యువతను మత్తులోకి దించే కుట్రలకు పాల్పడుతోంది. పాక్‌ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేసిన భారత సైన్యం ఇప్పుడు పూర్తిగా అడ్డుకునేందుకు సిద్ధమైంది. గగన తలంలో డ్రోన్లు కనిపిస్తే నేలకూల్చే అధునాతన ఆయుధాలతో సరిహద్దుల్లో పహారా కాస్తోంది. సరిహద్దుల్లో పాకిస్థాన్‌ ఉగ్రకుట్రలను భగ్నం చేసేందుకు..భారత్‌ మరింత అప్రమత్తమైంది.

డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను భగ్నం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. డ్రోన్ల ద్వారా ఆయుధాలుడ్రగ్స్‌ అక్రమ రవాణను ఇప్పటికే చాలాసార్లు భగ్నం చేసిన భారత భద్రతా బలగాలు ఇప్పుడు మరింత ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. పాక్‌ వైపు నుంచి సరిహద్దులు దాటి ఇవతలి వైపునకు డ్రోన్లు అన్నవే రాకుండా మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వీటిని దాటుకుని డ్రోన్లు భారత గగన తలంలో అడుగుపెట్టే అవకాశమే లేదని భారత భద్రతా దళాలు స్పష్టం చేస్తున్నాయి.

సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్లను నేలకూల్చేందుకు అధునాతన స్పెషల్ మౌంటెడ్ గన్స్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. భారత ఆర్మీలో విజిలెన్స్ సరిహద్దు భద్రతా దళం సరిహద్దులను కాపాడేందుకు అవిశ్రాంతంగా పని చేస్తోంది. సరిహద్దుల్లో మంచుతో కప్పబడిన పర్వతాల్లో నిఘాను మరింత పెంచారు. ఈ అధునాతన మౌంటెడ్‌ గన్స్‌ను చేతపట్టిన సైనికులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. పూంచ్, రాజౌరీ సెక్టార్లలో ఈ అధునాతన గన్స్‌ను మోహరించారు. సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాలు నిర్వహించేందుకు డ్రోన్‌ల వంటి పరికరాలను పాకిస్థాన్ ఉపయోగిస్తోందని వాటిని వీటితో భగ్నం చేయవచ్చని భద్రతా బలగాలు తెలిపాయి.


Tags

Read MoreRead Less
Next Story