Kejriwal: కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలను హైకోర్టు అడ్డుకుంది. ఈ రోజు సాయంత్రం తీహార్ జైలు నుంచి బయటకు రావాల్సిన కేజ్రీవాల్ ను విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. గురువారం ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. ఈమేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. కేజ్రీవాల్ బెయిల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో సాయంత్రం తమ అధినేత బయటకు వస్తారని సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు షాక్ తగిలినట్లైంది.
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే నేడు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సిఉండగా.. ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ‘‘బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com