Karnataka Government: ఆఫీస్ కి చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్ దుస్తులు నిషేధం

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో హుందాగా కనిపించే దుస్తులు మాత్రమే ధరించాలని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సిబ్బంది పరిపాలన, సంస్కరణల విభాగం (DPAR) అన్ని ప్రధాన శాఖలకు, ఉన్నతాధికారులకు సర్క్యులర్‌ను పంపింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు అసభ్యకరమైన దుస్తులతో విధులకు హాజరవుతున్నారని ప్రజలు, పలు సంస్థల నుంచి ఫిర్యాదులు అందినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గతంలో సూచనలు ఇచ్చినా చాలామంది పాటించడం లేదని, అందుకే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. కొంతమంది యువ ఉద్యోగులు చిరిగిన జీన్స్ (Torn Jeans), స్లీవ్‌లెస్ డ్రెస్సులు, శరీరానికి అతుక్కుపోయే బిగుతైన దుస్తులు ధరించి కాలేజీ విద్యార్థుల్లా ఆఫీసులకు వస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్ షడాక్షరి స్వాగతించారు. ఒకరి దుస్తులు ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని, కార్యాలయాల్లో హుందాతనం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ సర్క్యులర్‌లోనే మరికొన్ని నిబంధనలను కూడా గుర్తుచేశారు. ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఉదయం 10:10 గంటలకల్లా కార్యాలయంలో ఉండాలని, అధికారిక పని మీద బయటకు వెళ్తే ఆ వివరాలను రిజిస్టర్‌లో రాయాలని తెలిపారు. అలాగే, ఆఫీసులోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తమ వద్ద ఉన్న నగదు వివరాలను క్యాష్ డిక్లరేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని కూడా సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

