Different Dowry : కూతురి పెళ్లికి కట్నంగా సర్పాలు

Different Dowry : కూతురి పెళ్లికి కట్నంగా సర్పాలు
ఈ తెగల్లో పాము లేనిదే పెళ్లి కాదు

పెళ్ళిలో వరుడికి కట్నంగా డబ్బో, బంగారమో, పొలమో కానుకగా ఇవ్వడం సాధారణమే. కట్నం అన్న పేరు పెడితే కేసు అయిపోతుందన్న భయంతో కాస్త పేరు మారుస్తారు గానీ బహుమతులను మాత్రం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉంటారు. అయితే పాములను బహుమతులుగా ఇవ్వడం ఎప్పుడైనా చూశారా.మన దేశంలోని ఓ గిరిజన తెగ వందల ఏళ్లుగా ఇదే ఆచారాన్ని పాటిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా ప్రాంతానికి చెందిన ఓ గిరిజన తెగ ఓ వింత ఆచారాన్ని పాటిస్తోంది. పెళ్లిళ్ల సమయంలో.. సన్వారా తెగలోని వధువు తరఫువారు వరుడికి సర్పాలను కట్నంగా ఇచ్చుకుంటారు. మొత్తం 9 రకాల జాతులకు చెందిన 21 సర్పాలను అల్లుడికి అందజేస్తారు. వారు ఈ పద్ధతిని ఎంత బాగా ఫాలో అవుతారు అంటే అలా కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోరు. వివాహ సమయంలో మెట్టినింటికి 9 జాతుల పాములను తీసుకురాలేకపోతే ఆ పెళ్లి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సన్వారా గిరిజనులు భావిస్తారు. నిజానికి ఈ తెగవారు పాములను ప్రదర్శించి, వాటితో నృత్యం చేయించి, అదే జీవనాధారంగా బతుకుతారు

ఒకప్పుడు వీరు విషపూరిత సర్పాలను కూడా కట్నంగా ఇచ్చుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందుకు అనుమతించట్లేదు. కేవలం విషరహిత పాములను మాత్రమే పట్టుకునేందుకు గిరిజనులకు అనుమతిస్తోంది. అదికూడా స్థానిక సంప్రదాయాలను గౌరవించి వీరికి ఈ అనుమతులు ఇచ్చింది. నిజానికి ఇలాంటి ఆచారాలను యూత్ పాటించరు అనుకుంటాం కానీ ఈ తెగలో తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించేందుకే ఇక్కడి యువకులు మొగ్గు చూపుతున్నారు.



మధ్యప్రదేశ్‌లో కూడా అలాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. గౌరియా కమ్యూనిటీలో కూడా కట్నంలో వధువు తండ్రి విషపూరిత పాములను అల్లుడికి కట్నంగా ఇస్తాడు. కూతురికి ఎంగేజ్మెంట్ అయిన రోజు నుంచి తండ్రి పాములు పట్టడానికి బయలుదేరుతాడు. అంతేకాదు. వాళ్ల పెట్టెలో పాము చనిపోతే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఏ విధంగా అయితే గుండు చేయించుకుంటారో అలాగే కుటుంబమంతా గుండు కొట్టించుకుంటారు.దీంతో పాటు ఈ సంఘంలోని ప్రజలందరికీ భోజనాలు పెట్టిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story