Supreme Court : చార్జిషీట్ ఇంగ్లిష్‌లో ఉండొచ్చు

దర్యాప్తు సంస్థలు దాఖలు చేసే ఛార్జిషీట్లు ఏ భాషలో ఉండాలనేదానిపై నిర్దిష్టమైన నిబంధనలు ఏవీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) ప్రకారం ఒక్క హైకోర్టులో తప్ప మిగతా కోర్టుల్లో ఏ భాషను ఉపయోగించాలన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. కోర్టులో ఉపయోగించే భాషలోనే ఛార్జిషీటు కూడా ఇవ్వాలంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లో ఎక్కడా నిబంధన లేదని తెలిపింది.
ఛార్జిషీటు లో ఉపయోగించాల్సిన భాషపై ఎలాంటి నిబంధనను పొందుపరచలేదని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేష్ బిందాల్‌ల ధర్మాసనం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణంలోని ఇద్దరు నిందితులు..తమకు ఇంగ్లీష్ రాదని, ఛార్జిషీటును హిందీలో అనువాదం చేయించి ఇవ్వాలని తొలుత ట్రయల్ కోర్టును కోరారు. ఇందుకు ఆ కోర్టు అంగీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం, ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా న్యాయం జరగదని భావించిన సందర్భాల్లో మాత్రమే నిందితులు కోరిన భాషలో ఛార్జిషీటును ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
వ్యాపం కుంభకోణంలో ఇద్దరు నిందితులపై సీఆర్‌పీసీ సెక్షన్-173 కింద సీబీఐ ఇంగ్లీష్ భాషలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయగా, దీనిని హిందీ భాషలో సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ప్రత్యేకంగా ఈ కేసులోని నిందితులు విద్యావంతులని, అందువల్ల ఛార్జిషీటును హిందీలోకి తర్జుమా చేసి ఇవ్వాల్సిన పనిలేదని తెలిపింది.
మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రిటైర్డు ఉద్యోగులకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత తేదీతో వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. కేరళకు చెందిన ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. రిటైర్మెంట్ వయసు పెంపు ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com