POCSO: పోక్సో కేసుల విచారణకు సరిపడా జడ్జీలు లేరు

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై నమోదు చేసే పోక్సో కేసుల విచారణకు ట్రయల్ కోర్టుల్లో తగినంత మంది జడ్జీలు లేరని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రతి జిల్లాలో పోక్సో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంవంటి లక్ష్యాలు నెరవేరడం లేదని వ్యాఖ్యానించింది. 2019లో సుమోటోగా స్వీకరించిన ‘చిన్నారులపై అకృత్యాల పెరుగుదలపై ఆందోళన’ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
2019లో ఈ కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రతి జిల్లాలో కేంద్ర నిధులతో పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 పోక్సో కేసులను ప్రత్యేకంగా విచారించాలని ఆదేశించింది. ఇంకా చిన్నారులపై అఘాయిత్యాలను నివారించేందుకు చైతన్యం తీసుకురావాలని, ప్రాసిక్యూషన్‌పై అవగాహన కల్పించాలని, థియేటర్లు, ఛానళ్లలో వాటిపై ప్రచారం చేయాలని సూచించింది. కేంద్ర నిధులతో ఏర్పాటు చేసే కోర్టులో ప్రిసైడింగ్ అధికారులను, సహకరించే సిబ్బందిని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు సిబ్బందిని నియమించాలని, మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించింది. అయితే జిల్లా కోర్టుల్లో నియామకాలపై గతంలో ఇచ్చిన కొన్ని ఆదేశాలు అమలు కాలేదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ‘మనకు జిల్లా కోర్టుల్లో జడ్జీల్లేరు. ఏళ్లపాటు ఖాళీలు అలాగే ఉంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘ఉదాహరణకు గుజరాత్‌నే తీసుకోండి. అక్కడి జిల్లా కోర్టుల్లో తగినంత మంది జడ్జీల్లేరు’ అని పేర్కొన్నారు.
ఇద్దరు బిడ్డల హత్య కేసులో తండ్రి ఉరిశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు
సొంత బిడ్డలు ఇద్దరిని హత్య చేసిన కేసులో మరణ దండనను ఎదుర్కొంటోన్న తండ్రి శిక్షను ముందస్తు విడుదలకు అవకాశంలేని యావజ్జీవ ఖైదుగా సుప్రీంకోర్టు మార్చింది. దేవుడు సహజ మరణాన్ని ప్రసాదించే వరకు దోషిని జైలులోనే ఖైదీగా ఉంచాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆదేశించింది. పాశ్చాత్తాప భావనతో జైలులోని శేషజీవితాన్ని గడపాలని నిర్దేశించింది. బ్యాంకు మాజీ మేనేజర్ రమేశ్ ఎ.నాయక్‌కు గతంలో ఎటువంటి నేర నేపథ్యంలేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ధర్మాసనం శిక్షను సవరించింది. రమేశ్ భార్య కూడా బ్యాంక్ మేనేజర్. శోలాపుర్‌లో భర్త, మంగళూరులో భార్య ఉద్యోగాలు చేసుకునే వారు. వీరికి పదేళ్ల కుమారుడు, మూడున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. రమేశ్ తన మరదలికి ఉద్యోగం ఇప్పించాడు. అయితే, ఆమె మరో కులం వ్యక్తిని ప్రేమించడంతో ఆగ్రహించాడు. చెల్లెలి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవద్దంటూ భార్య నచ్చచెప్పినా పంతం వీడని రమేశ్.. మరదలిని, ఆమె తల్లిని హత్య చేసి మృతదేహాలను సెప్టిక్ ట్యాంకులో వేశాడు. ఆ తర్వాత మంగళూరు వచ్చి ఇద్దరు పిల్లలను నగర సందర్శనకు తీసుకెళ్లి పార్కులోని వాటర్ ట్యాంకులో ముంచి వారినీ హత్య చేశాడు. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ దోషి చేసుకున్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం సమ్మతించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com